- వరుసగా మారుతున్న ప్రతిపాదనలు
- సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురవుతున్న ప్రాంతాలు
- దుమ్ముగూడెం తెరపైకి రావడంతో భక్తులలో కొత్త ఆశలు
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోఎయిర్పోర్టు నిర్మాణం ఆశలపల్లకీలో ఊగిసలాడుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పనులు వేగవంతం అవుతుండగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మాత్రం ఆటంకం ఏర్పడుతోంది. భూసేకరణ, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఎప్పుడు ఎయిర్‌పోర్టు అంశం చర్చకు వచ్చినా కొత్త ప్లేస్‌లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎయిర్ పోర్టు ఆశ నెరవేరుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతా గందరగోళం...
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణం అనే ప్రతిపాదన వచ్చిన వెంటనే పాల్వంచ మండలంలోని పేటచెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నిర్వహించి ఎయిర్‌పోర్టు అథారిటీకి నివేదిక ఇచ్చారు. కానీ హెవీ కరెంట్ టవర్స్ ఉండటంతో టెక్నికల్ ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఉందని వారు తిరస్కరించారు. తర్వాత కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల బార్డర్‌లోని గరీబ్‌పేట ప్రాంతంలో సర్వే చేసి భూమి కేటాయించారు.
కానీ గుట్ట, గాలి వీచే దిశలో ప్రతికూలాంశాలను ఎయిర్‌పోర్టు అథారిటీ గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడును మరోసారి పరిశీలించాల్సిందిగా జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఫీజిబిలిటీపై అధ్యయనం జరుగుతుండగానే మరో కొత్త ప్రదేశం తెరపైకి వచ్చింది. దుమ్ముగూడెం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూ సర్వే జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం భూమిని పరిశీలించినట్లుగా పేర్కొంటున్నారు. కానీ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో ఇది సాధ్యమా? అనే అనుమానాలు వస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతంలోనే సాధ్యం కానప్పుడు ఇక్కడెలా కడతారు అనే గందరగోళం నెలకొంది.
ఒకవేళ దుమ్ముగూడెం అయితే...
దుమ్ముగూడెం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదన నిజమైతే మాత్రం రామభక్తులకు శుభవార్తే. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం సులభం అవుతుంది. మరోవైపు భద్రాచలాన్ని కలుపుతూ కేంద్ర రైల్వే శాఖ మల్కనగిరి(ఒడిశా)-, కొత్తగూడెం, కిరండోల్(ఛత్తీస్‌గఢ్)- కొత్తగూడెం రైల్వే లైన్లను మంజూరు చేసింది. ఈ రెండూ దుమ్ముగూడెం మండలాన్ని తాకుతూ వెళ్తున్నాయి. ఇక ఎయిర్‌పోర్టు కూడా ఇదే ప్రాంతంలో నిర్మిస్తే దక్షిణ అయోధ్యకు మంచిరోజులేనని చెప్పొచ్చు.
