- హామీలు అమలు చేయలేకనే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్
- దమ్ముంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార ఎన్నికలు పెట్టండి
- తనపైన ఏ కేసు పెడతారో చెప్పాలని సీఎం రేవంత్‌కు సవాల్
- నల్గొండలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు సన్మానం
నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల హనీమూన్ పీరియడ్ పూర్తయిందని, నిన్నటి వరకు ఒక లెక్క.. ఇక నేటి నుంచి మరో లెక్క అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే కదనభేరీ మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను మంగళవారం నల్లగొండలో కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆగడాలు, అరాచకాలను ఎదుర్కొని పంచాయతీల్లో వీరోచితంగా పోరాడారని కేడర్‌ను అభినందించారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 45 శాతం సీట్లు సాధించామని, ఎన్నికలు సజావుగా జరిగితే 60 శాతం గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించారు. రెండేండ్ల పాలనపైన విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించినా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోమని ఎమ్మెల్యేలు బెదిరించినా ఇన్ని స్థానాలు గెలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఫలితాలు చూసి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నదని, దాంతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేందుకు భయపడుతున్నారని అన్నారు. జాతీయ రైతు దినోత్సవం రోజన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, సహకార సంఘాలకు ఎన్నికలు రద్దుచేసి నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. రేవంత్సర్కారుకు దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌చేశారు.
పాలమూరు ప్రాజెక్టును ప్రభుత్వం అడ్డుకుంటున్నది..
పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటున్నదని కేటీఆర్అన్నారు. కేంద్రం డీపీఆర్ తిప్పి పంపినా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం లేదని విమర్శించారు. నదీ జలాల అన్యాయంపై నల్లగొండ నుంచే రణభేరీ మోగిస్తామని తెలిపారు. నీళ్ల వాటాలపైనా ఈ ప్రభుత్వానికి అవగాహన లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే సమాధానం చెప్పే దమ్ము సర్కారుకు లేదన్నారు. కేసీఆర్ హయాంలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా 10 శాతం పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారన్నారు. దమ్ముంటే తెరచాటు రాజకీయాలు మానుకొని, తనపై ఏ కేసు పెడతారో బహిరంగంగా ప్రకటించాలని రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు.
రెండేండ్లలో2.50 లక్షల కోట్ల అప్పు చేసిన్రు..
అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కేసీఆర్ హయాంలో చేసిన అప్పు మొత్తం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని స్వయంగా పార్లమెంట్‌లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు. రేవంత్‌రెడ్డి రూ. 8 లక్షల కోట్లని, భట్టి విక్రమార్క రూ. 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేశారని అన్నారు. రెండేండ్లలో రేవంత్‌రెడ్డి 2.50 లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
