టికెట్ ధరలు పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నరు : కేటీఆర్

టికెట్ ధరలు పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నరు : కేటీఆర్
  • ఉచిత బస్సు స్కీమ్​తో ఆర్టీసీ దివాలా: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ బస్సుల్లో కనీస చార్జీపై రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్​ సర్కారు కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. బస్సు చార్జీల పెంపు పిడుగులాంటిదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చార్జీల పెంపుతో సగటు ప్రయాణికుడిపై నెలా నెలా అదనంగా రూ.500 భారం పడుతుందని, బడుగులు, కూలీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. 

ఇప్పటికే విద్యార్థుల బస్​పాస్ చార్జీలు, టీ24 టికెట్ ధరలు పెంచింది చాలదన్నట్టు.. కనీసచార్జీపైనా 50 శాతం పెంచడం రేవంత్ అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉచిత బస్సు స్కీమ్​తో ఆర్టీసీని కాంగ్రెస్​ ప్రభుత్వం దివాలా తీయించిందని, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడడం క్షమించరానిదని మండిపడ్డారు.