సహస్ర మర్డర్ కేసులో వీడని చిక్కుముడి

 సహస్ర మర్డర్ కేసులో  వీడని చిక్కుముడి
  • తల్లిదండ్రులను విచారించిన పోలీసుల
  •  ఒడిశా వ్యక్తి నుంచి దొరకని సమాచారం
  • బయటి వ్యక్తులు బిల్డింగులోకి రాలేదని నిర్ధారణ
  • చనిపోయేముందు డాడీ.. డాడీ అంటూ సహస్ర అరుపులు

కూకట్​పల్లి, వెలుగు:  నాలుగు రోజుల క్రితం కూకట్​పల్లిలో హత్యకు గురైన బాలిక సహస్ర కేసు చిక్కుముడి ఇంకా వీడడం లేదు. ప్రధానంగా పోలీసులు అనుమానించిన ఒడిశాకు చెందిన వ్యక్తి నుంచి ఎలాంటి విలువైన సమాచారం రాకపోవడంతో గురువారం పోలీసులు సహస్ర తల్లిదండ్రులను విచారణకు పిలిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే పలుమార్లు తల్లిదండ్రులను ఇంటి దగ్గర విచారించిన పోలీసులు చివరికి పీఎస్​కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా, ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నా చిన్న క్లూ కూడా దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఎంత మంది అనుమానితులను విచారిస్తున్నా, దొరికిన సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నా ఫలితం లేకపోవడం పోలీసులకు సవాల్​గా మారింది. పోలీసుల విచారణలో సహస్ర తల్లిదండ్రులు తమకు ఎవరి మీదా అనుమానం లేదని, శత్రువులు ఎవరూ లేరని మొదటి నుంచి చెబుతుండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. మర్డర్​జరిగిన బిల్డింగ్​కు సీసీ కెమెరాలు లేకపోవడం, పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించినా ఎటువంటి అనుమానాస్పద దృశ్యాలు కనిపించలేదు. హత్య జరిగిన సమయంలో బిల్డింగ్​లోకి బయటి వారు ఎవరూ వెళ్లి వచ్చినట్టు ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు మొదట బిల్డింగ్​లోని కుటుంబాలను పలు కోణాల్లో విచారించారు. 

ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశాకు చెందిన సంజయ్​ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరికి ఇతని నుంచి కూడా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు కుంటుపడింది. ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి కృష్ణనే మొదట కూతురి మృతదేహాన్ని చూశాడు. అంతకు ముందు బిల్డింగ్​పై నుంచి డాడీ డాడీ అనే కేకలు వినిపించాయని కింది అంతస్తుల్లో ఉంటున్న వారు పోలీసులకు తెలిపారు. బాలిక కేకలు వినిపించినా ఎవరూ పైకి వెళ్లి చేసే ప్రయత్నం చేయలేదు. బాలిక తనపై ఎవరైనా దాడి చేసినప్పుడే కేకలు వేసి ఉంటుందని, అయితే ఆ తర్వాత ఎవరూ బిల్డింగ్​ నుంచి బయటకు వెళ్లిన ఆధారాలు కనిపించడం లేదు. ఇక్కడే కేసు చిక్కుముడిగా మారింది. 

అసలు సహస్రను హత్య చేసింది ఎవరు? అందుకు కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలకు నాలుగు రోజుల నుంచి సమాధానాలు లభించడం లేదు. ఎప్పటివరకు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందనేది పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.