వారసులు లేరని భూమిని  బంధువులు లాక్కున్నరు

వారసులు లేరని భూమిని  బంధువులు లాక్కున్నరు

ఎనిమిదేండ్లుగా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు
కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలంటూ వృద్ధురాలి ఆవేదన

హసన్ పర్తి, వెలుగు: 13 ఎకరాల భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దగ్గరి బంధువులు కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని.. న్యాయం చేయాలంటూ ఎనిమిదేండ్లుగా ఓ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరుగుతోంది. హసన్​పర్తి మండలం భీమారం గ్రామంలో శుక్రవారం ప్రెస్మీట్ పెట్టి తన ఆవేదనను తెలియజేసింది. బాధితురాలు అనసూర్య(80) వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నాయిని వెంకటయ్య, అనసూర్య భార్యాభర్తలు. గ్రామ శివారులో వీరు సుమారు 13 ఎకరాల భూమిని సంపాదించుకున్నారు. వీరికి వారసులు లేకపోవడంతో వెంకటయ్య అక్క కొడుకులు ఇద్దరు వారి దగ్గర చేరారు. వారి భార్యలను వెంకటయ్య కూతుళ్లుగా చూపించి 2011లో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వెంకటయ్య మరణానంతరం ఆయన భార్య అనసూయ తమ భూమిని ఎవరికీ ఇవ్వలేదని, తనను మోసం చేసి తప్పుడు సంతకాలతో భూమి లాక్కున్నారని సంబంధిత తహసీల్దార్ ఆఫీసులో 2012లో ఫిర్యాదు చేశారు. ధర్మసాగర్ తహసీల్దార్ తనకు వారసులు లేరని సర్టిఫికెట్ సైతం ఇచ్చారని అనసూర్య పేర్కొన్నారు. భూమి విలువ సుమారు  రూ.10 కోట్లు ఉంటుందని, తహసీల్దార్, ఆర్ఐలు, రియల్టర్లతో కుమ్మక్కై కేసులో ఉన్న తన భూమిని మూడున్నర ఎకరాలు మరొకరికి అమ్మించినట్లు శుక్రవారం తెలిసిందన్నారు. తనకు న్యాయం చేస్తానని నమ్మించి, తహసీల్దార్ మోసం చేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.