టెన్త్ స్టూడెంట్ల వివరాల సవరణకు 30 వరకు ఛాన్స్

టెన్త్ స్టూడెంట్ల వివరాల సవరణకు 30 వరకు ఛాన్స్

హైదరాబాద్, వెలుగు:  వచ్చే ఏడాది మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల నామినల్ రోల్స్ డేటాలో ఏవైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది. ఈనెల 22 నుంచి 30 వరకు ఎడిట్ చేసుకోవచ్చు అని ఆ విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి శనివారం ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. వాస్తవానికి డిసెంబర్ 1 నుంచి 15 వరకు కరెక్షన్లకు ఛాన్స్ ఇచ్చినా.. ఇంకా కొన్ని స్కూళ్ల నుంచి విజ్ఞప్తులు రావడంతో, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 'వన్ టైమ్ ఆపర్చునిటీ' కింద ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. 

విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని, స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలని హెడ్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే చివరి అవకాశమని, డిసెంబర్ 30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. పాస్ సర్టిఫికెట్లలో తప్పులు దొర్లకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత స్కూల్ హెడ్ మాస్టర్లదేనని, భవిష్యత్తులో సమస్యలొస్తే వారే జవాబుదారీ అని డైరెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ స్కూల్ హెచ్​ఎంలను సంప్రదించి వివరాలు సరిచూసుకోవాలని సూచించారు.