- భూసేకరణతో లీడర్లు, రియల్టర్లే లాభపడ్తున్నరు: వక్తలు
- జోన్ల పేరుతో అన్యాయం చేయొద్దు: బండారు దత్తాత్రేయ
- హెచ్ఎండీఏ పరిధిలోని రైతుల పరిస్థితిపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధి విస్తరించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భూసేకరణలో రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించాలని పలువురు వక్తలు సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలోని రైతుల పరిస్థితిపై శనివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
దీనికి హిమాచల్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, లోక్సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ తదితరులు హాజరయ్యారు. అభివృద్ధి పనుల పేరుతో జరిగే భూసేకరణ వల్ల రైతులకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వంలోని కొందరు లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే బాగుపడుతున్నారని వక్తలు విమర్శించారు. రైతులకు అనుకూల పాలసీ తీసుకురావాలని, జోన్ల పేరుతో అన్యాయం చేయొద్దని, వ్యవసాయ భూములను మల్టీజోన్గా ప్రకటించాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
ఓఆర్‌ఆర్, హెచ్‌ఎండీఏలో సేకరించిన భూములకు సరైన పరిహారం రాలేదన్నారు. పార్టీలకతీతంగా త్వరలో రైతుల సమస్యలపై ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో భూసేకరణ అంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందని, మహారాష్ట్రలో మాత్రం మార్కెట్ రేటుకు మూడింతలు ఇస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల భూములపై పాలకులు, రియల్టర్ల చూపు పడిందని, అవసరమైన దానికంటే ఎక్కువ భూములు సేకరిస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. అభివృద్ధిని ఆపే హక్కు ఎవరికీ లేదని.. కానీ పారదర్శకంగా పరిహారం చెల్లించాలని, జోన్ల పేరుతో ఆంక్షలు పెట్టకూడదని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. సమావేశంలో సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డితో పాటు మాజీ ఉన్నతాధికారులు కరుణా గోపాల్, నిర్మల పాల్గొన్నారు.
