బీఆర్ఎస్ ప్రకటనపై జాతీయ నేతల్లో స్పందన కరువు

బీఆర్ఎస్ ప్రకటనపై జాతీయ నేతల్లో స్పందన కరువు
  • సీఈసీని కోరిన టీఆర్ఎస్ నేతలు.. 
  • తీర్మానం కాపీ, కేసీఆర్ రాసిన లెటర్ అందజేత
  • ఈ నెల 14లోగా ఈసీ ఆమోదిస్తే.. మునుగోడులో బీఆర్‌‌‌‌ఎస్ పేరుతో పోటీ: వినోద్

హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మారుస్తూ తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, ఈ మేరకు పార్టీ పేరును మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని గులాబీ నేతలు కోరారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించేందుకు పేరు మార్చాలని నిర్ణయించిందని, ఇందుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్‌‌లోని నిబంధనల మేరకు కొత్త పేరుకు ఆమోదం తెలపాలని కోరారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మను కలిశారు. పార్టీ పేరు మారుస్తూ చేసిన తీర్మానం కాపీని, సీఈసీకి కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు. తమ విజ్ఞప్తిపై ధర్మేంద్ర శర్మ స్పందిస్తూ.. భారత్ రాష్ట్ర సమితి పేరుతో వేరే ఎవరైనా దరఖాస్తు చేసుకున్నారా, ఇతర సాంకేతిక అంశాలు ఏమైనా ఉన్నాయా.. అనేది పరిశీలించి వీలైనంత త్వరగా ప్రాసెస్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వినోద్ కుమార్ మీడియాకు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 14వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘం.. టీఆర్ఎస్‌‌ను భారత్‌‌ రాష్ట్ర సమితిగా మార్చితే తప్పకుండా బీఆర్‌‌ఎస్‌‌ పేరుతోనే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయానికి పేరు మారకుంటే  టీఆర్‌‌ఎస్‌‌ పేరుపైనే బరిలో దిగుతామని అన్నారు.

ఉజ్వల భారత్ కోసం ప్రయత్నిస్త: కేసీఆర్

తెలంగాణ సీఎంగా ఉంటూనే ఉజ్వల భారత్ కోసం ప్రయత్నిస్తానని, తన కార్యక్షేత్రమైన తెలంగాణను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు. ఇక్కడ ఉంటూనే దేశ గతిని మార్చేందుకు, గుణాత్మక మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్‌‌ను ఎందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌గా మార్చాలని అనుకుంటున్నారో వివరించారు. ఏడేండ్లలోనే తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని, 75 ఏండ్లు దేశాన్ని పాలించిన వారికి ఈ చిత్తశుద్ధి లోపించిందని అన్నారు. మహిళలు, రైతులు, దళితులు, గిరిజనులు, పేదల ఎజెండాతో బీఆర్ఎస్ ముందుకెళ్తుందన్నారు. బీఆర్ఎస్ అనుబంధ రైతు సంఘటన్‌‌ను మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామని, త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ విజన్‌‌తో ముందుకెళ్తే దేశం పురోగమించడం ఖాయమని జేడీఎస్ నేత, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ కర్నాటక ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగానూ బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళన్ మాట్లాడుతూ, కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని, ఆయన ప్రవేశపెట్టిన దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆమోదంతో బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. 

బీఆర్ఎస్ పేరుతో ఇంకో పార్టీ ఉంటే.. 

మునుగోడు ఉప ఎన్నికలో ఏ పేరుతో పార్టీ పోటీ చేయబోతున్నదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్‌‌ను బీఆర్ఎస్‌‌గా మార్చుతూ చేసిన తీర్మానాన్ని సీఈసీ వెంటనే ఆమోదిస్తుందని, బీఆర్ఎస్ పేరుతో బైపోల్‌‌లో పోటీ చేస్తామని మొదట్లో ప్రకటించిన నేతలు.. తీరా సీఈసీని కలిసిన తర్వాత కన్ఫ్యూజన్‌‌లో పడిపోయారు. ఒకవేళ భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఇంకెవరైనా దరఖాస్తు చేసుకొని ఉంటే పేరు మార్పు అంత సులభం కాదు. అలాగే బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా కొత్త పార్టీ ఏర్పాటవుతున్నట్టు కనీసం రెండు జాతీయ స్థాయి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్‌‌గా ఉన్న కారు గుర్తు కేటాయింపుపైనా అబ్జక్షన్స్ తీసుకోవాలి. ఇదంతా క్రమపద్ధతిలో చేయాల్సిన ప్రక్రియ అని, అనుకున్నంత సులువుగా పూర్తి కాదని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకు మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేస్తారని, బీఆర్ఎస్‌‌గా పేరు మార్చుకునేందుకు ఎక్కువ సమయమే పడుతుందని పేర్కొన్నారు.

దేశంలోని దళితులతో కాన్‌‌క్లేవ్ నిర్వహిస్త: కేసీఆర్

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశంలోని దళితులతో హైదరాబాద్‌‌లో దళిత్ కాన్‌‌క్లేవ్ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. గురువారం ప్రగతి భవన్‌‌లో తమిళనాడుకు చెందిన దళిత నేత, వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళన్‌‌తో పాటు పలువురు లీడర్లు కేసీఆర్‌‌‌‌ను కలిసి సత్కరించారు. తెలంగాణలో దళితుల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అలాంటి పథకాలే అమలు చేయాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. దళిత్ కాన్ క్లేవ్‌‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దళితులతో చర్చలు జరుపుతామన్నారు. దళితబంధు గొప్ప పథకమని వీసీకే అధినేత తిరుమావళన్ అన్నారు. రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్, సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ, సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్, మహారాష్ట్ర రైతు నాయకుడు దశరత్ సావంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పుడు మన పార్టీ పేరేంటి: గులాబీ లీడర్లలో అయోమయం
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చుతూ తీర్మానం ఆమోదించిన తర్వాత గులాబీ పార్టీ నేతల్లోనే అయోమయం నెలకొంది. తమ పార్టీ పేరు ఇప్పుడు టీఆర్ఎస్సా లేక బీఆర్ఎస్సా అర్థం కావడం లేదని పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ ఆవరణలోనే వ్యాఖ్యానించారు. కేసీఆర్ పార్టీ పేరు ప్రకటించినప్పుడు చప్పట్లతో ఆమోదం తెలిపిన నేతల్లో బయటకు వచ్చిన తర్వాత ఆ ఉత్సాహం కనిపించలేదు. మీడియా ప్రతినిధులు పలువురిని పలకరించగా.. మాట్లాడటానికి ఇంట్రస్ట్ చూపించలేదు. కొద్ది మంది మాత్రమే దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ చక్రం తిప్పుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్భంగా భారీ ఎత్తున వేడుకలు చేయబోతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ తెలంగాణ భవన్ ఎదుట కొద్ది మందితోనే సంబురాలు చేసుకుని మమ అనిపించారు.

పార్టీలు స్పందించలే
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మారుస్తూ తీర్మానం చేయడంపై దేశంలోని వివిధ పార్టీల నేతలు పెద్దగా స్పందించలేదు. కేసీఆర్ చార్టర్డ్ ఫ్లైట్ పంపి హైదరాబాద్‌‌కు పిలిపించిన కుమారస్వామి, రాచమర్యాదలతో రప్పించిన తమిళనాడు నేత తిరుమావళన్, కేసీఆర్‌‌‌‌తో కొంత కాలంగా కలిసి పనిచేస్తున్న రైతు సంఘాల నేతలు తప్ప పెద్దగా ఇంకెవరూ పట్టించుకోలేదు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందంటే స్వాగతిస్తామని, అక్కడ ఉన్న పార్టీల లాంటిదే కొత్త పార్టీ కూడా అని ఏపీ మంత్రులు చెప్పారు. బీఆర్ఎస్‌‌పై తీర్మానం చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. గతంలో జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి రావాలంటూ కేసీఆర్ కలిసిన వివిధ రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల అధినేతలు బీఆర్ఎస్‌‌పై రియాక్ట్ కాలేదు.