ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలి : ప్రజా సంఘాల నాయకులు

ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలి : ప్రజా సంఘాల నాయకులు

సూర్యాపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వీడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రాలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడంలో దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరిరావు, కొప్పుల రజిత, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జంపాల స్వరాజ్యం, నల్ల మేకల అంజయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నల్ల జెండాలతో నిరసన

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్లజెండాలతో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కనీస మద్దతు ధర చట్టం చేస్తామని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చి దొడ్డిదారిన అమలు చేయడానికి కుట్ర చేస్తుందని మండిపడ్డారు. 

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్​సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్న వెంకులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 

బీజేపీ.. పేదలకు ఉపాధి లేకుండా చేస్తుంది

హుజూర్ నగర్, వెలుగు : కేంద్రం ప్రభుత్వం పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పల్లె వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ శుక్రవారం హుజూర్ నగర్ లో నూతన ఉపాధి హామీ ప్రతులను దహనం చేశారు. కొత్తగా తెచ్చిన నిబంధనల వల్ల రైతు కూలీలు ఉపాధి హామీ పథకానికి దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు దుగ్గి బ్రహ్మం, శ్రీలం శీను, పోసనబోయిన హుస్సేన్, రేపాకుల మురళి, పాశం వీరబాబు, పాశం వెంకటనారాయణ, షేక్ కాశీం, ఇంటి తిరపయ్య తదితరులు 
పాల్గొన్నారు.