
- మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి: వామపక్షాలు
ముషీరాబాద్, వెలుగు: ఆపరేషన్ కగార్ ఆపేసి.. మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లో గురువారం నిరసన చేపట్టారు. ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు. న్యూ డెమోక్రసీ సభ్యుడు గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడారు. రాజ్యాంగం, చట్టాలను ఉల్లంఘిస్తూ జంతువులను వేటాడినట్లు ఆదివాసీలు, మావోయిస్టులను చంపడం దారుణమన్నారు.
మావోయిస్టులనే వారు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించడం దారుణమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు ద్వారా విచారణ జరిపించాలని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్ చేశారు.