గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం : గుత్తా సుఖేందర్ రెడ్డి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం : గుత్తా సుఖేందర్ రెడ్డి
  • శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

నకిరేకల్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తే ప్రజలే తిరిగి ఆశీర్వదిస్తారని ఆయన పేర్కొన్నారు. అవకాశాలు అందరికీ రావని, వచ్చినవారు గ్రామాభివృద్ధికి పూర్తిస్థాయిలో తోడ్పడాలని సూచించారు. 

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గెలిచిన సర్పంచులు తమ గ్రామాలను ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించగా.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్న కైలాష్ నేతతో పాటు ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, నాయకులు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సభా వేదిక వరకు వేలాదిమంది కాంగ్రెస్ శ్రేణులతో భారీ ప్రదర్శన నిర్వహించారు.