తప్పుడు సమాచారమిచ్చి విశ్వసనీయతను కోల్పోయారు

తప్పుడు సమాచారమిచ్చి విశ్వసనీయతను కోల్పోయారు

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక్క మెడికల్ కాలేజీనీ మంజూరు చేయలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించడంతో, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్రం నుండి అధికారికంగా ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య రిప్లై ఇచ్చారు. ఈ తరహాలో కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి మధ్య కాసేపటి వరకూ ట్వీట్ల యుద్దం జరిగింది. అనంతరం వెంటనే స్పందించిన కేటీఆర్.. ముఖ్యమంత్రి 16 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, మరో 13 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 'ఇప్పుడు, మన ప్రధాని మోదీ జీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో నేను మీకు చెప్తాను అన్న కేటీఆర్..-- సున్నా' అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దానికి సమాధానంగా..  "మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపింది? 'జీరో'" అని మాండవ్య రిప్లై ఇవ్వడంతో ఇష్యూ మరింత పెద్దదైంది. ఈ క్రమంలోనే ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు ఎలాంటి పక్షపాతం లేకుండా అతి తక్కువ సమయంలోనే అత్యధిక ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రధాని మోదీ మంజూరు చేశారని మాండవ్య  తెలిపారు.

దీంతో 2015, 2019లో మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన రెండు ప్రకటనలను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో వైద్య కళాశాలల కోసం అభ్యర్థిస్తోందని.. కానీ కేంద్రం పంపింది మాత్రం జీరో అని కామెంట్ చేశారు. తెలంగాణాలోని రెండు జిల్లాల్లో ఇప్పటికే ఉన్న జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను పంపాలని కోరుతూ అప్పటి హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ ఆగస్టు 2019,21 లో తెలంగాణకు పంపిన ఓ ప్రకటనను మాండవ్య షేర్ చేశారు. దీంతో పాటు ఫేజ్ 3 కింద అన్ని రాష్ట్రాలు/UTలు మంత్రిత్వ శాఖలో పరిశీలన కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అభ్యర్థించినా.. తెలంగాణ మాత్రం ఎలాంటి ప్రతిపాదనా పంపలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా తన విశ్వసనీయతను కోల్పోయారన్నారు.  ఇండిపెండెంట్ ఇండియాలో ఒక కేంద్ర మంత్రి జీరో మెడికల్ కాలేజీలు అందించి... రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమేనని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమనేని, ఇది అవమానకరమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.