
- అడ్వకేట్ డ్రెస్‌లో వచ్చి కాల్పులు
- జడ్జి ముందే ఘటన
- ఇద్దరు పోలీసులు, ఓ మహిళకు గాయాలు
- 50కి పైగా క్రిమినల్ కేసుల్లో సంజీవ్ నిందితుడు
- ముక్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు
లక్నో: యూపీలోని లక్నోలో దారుణం జరిగింది. అడ్వకేట్ డ్రెస్సులు వేసుకుని కైసర్‌బాగ్‌లోని సిటీ సివిల్ కోర్టులోకి దూసుకొచ్చిన దుండగులు సంజీవ్ మహేశ్వరీ అనే గ్యాంగ్ స్టర్‌ను కాల్చి చంపేశారు. కోర్టు రూమ్‌లోనే ఈ ఘటన జరిగింది. ఫైరింగ్‌లో ఇద్దరు పోలీసులతో పాటు ఓ మహిళ, పిల్లాడు కూడా గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. పశ్చిమ యూపీలో సంజీవ్ మహేశ్వరీ అలియాస్ సంజీవ్ జీవ గ్యాంగ్ మెయింటెన్ చేస్తుండేవాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సంజీవ్‌పై 50కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. పలు హత్యలు, దోపిడీలు, కిడ్నాప్కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చాలా ఏండ్ల పాటు జైలు జీవితం గడిపాడు. గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి సంజీవ్ జీవ అత్యంత సన్నిహితుడు.
బీజేపీ లీడర్ బ్రహ్మదత్ మర్డర్ కేసులో..
బీజేపీ లీడర్ బ్రహ్మదత్ ద్వివేది మర్డర్ కేసులో అన్సారీతో పాటు సంజీవ్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం బుధవారం పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు కోర్టు రూమ్‌లో సంజీవ్‌ను జడ్జి విచారిస్తున్నారు. అంతలోనే అడ్వకేట్ డ్రెస్సులో వచ్చిన కొందరు సంజీవ్‌పై దాడికి దిగారు. తర్వాత గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యారు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజీవ్ జీవాను వెంటనే పోలీసులు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.
కోర్టు ముందు అడ్వకేట్ల నిరసన
సంజీవ్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు ప్రకటించారు. మరికొందరి కోసం గాలిస్తున్నామని వివరించారు. ఫైరింగ్ చేసిన వ్యక్తి రివాల్వర్‌తో కోర్టులోకి ఎలా ప్రవేశించాడన్న దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలిపారు. అడ్వకేట్ డ్రెస్‌లో ఉండటంతో అనుమానం రాలేదన్నారు. కోర్టు ఆవరణలోనే ఎవరైనా గన్ ఇస్తే కాల్పులు జరిపారా అన్న కోణంలోనూ విచారిస్తున్నామని తెలిపారు. పోలీసులు క్లూస్ సేకరిస్తున్నామన్నారు. లక్నో సివిల్ కోర్టులోని అడ్వకేట్లు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే అతీక్ అహ్మద్, అతని సోదరుడిని కాల్చి చంపేశారన్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: కేశవ్ ప్రసాద్ మౌర్య, డిప్యూటీ సీఎం సంజీవ్ జీవా హత్యపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని, మరికొందరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. చట్టప్రకారం అతనికి శిక్ష విధిస్తామన్నారు. కాల్పులు జరిపిన నిందితుడు బతకడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యూపీలో ప్రజాస్వామ్యం ఉందా?: అఖిలేశ్ యాదవ్
కాల్పుల ఘటన రాష్ట్రంలో భయాందోళనకు దారితీసిందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ సరిగ్గాలేదని విమర్శించారు. శాంతిభ్రదతలు అధ్వానంగా ఉన్నాయన్నారు. యూపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో ఎలా చంపుతున్నారనేది క్వశ్చన్ అని అఖిలేశ్ విమర్శించారు.