ఎదురీది.. ఎదిగింది

ఎదురీది.. ఎదిగింది

చిన్న వయసులోనే పోలియో వచ్చింది. అయితేనేం పోరాడింది. పెద్ద చదువులు చదివింది. ఉద్యోగంలో స్థిరపడింది. 37 ఏండ్ల వయసులో మరో ఆరోగ్య సమస్య. అయినా పారాస్విమ్మర్‌‌‌‌గా.. నేషనల్‌‌ లెవెల్‌‌లో బంగారు పతకాలు సాధించింది. అకాడమీని కూడా ఏర్పాటు చేసింది ప్రతిగడుపు మాధవీలత. 
డిసేబిలిటీ శరీరానికే, టాలెంట్‌‌కు కాదని నిరూపించింది మాధవీలత. ఏడు నెలల వయసులో పోలియో బారిన పడినా.. వెనకడుగు వేయలేదు. పారాలింపిక్‌‌ స్విమ్మింగ్‌‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఎంతోమంది స్విమ్మర్‌‌‌‌లకు ట్రైనింగ్‌‌ ఇస్తోంది. ‘వైడబ్ల్యూటీసీ’  ఛారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ పెట్టి ఫిజికల్లీ డిసేబుల్డ్‌‌ వాళ్లకు సాయం చేస్తోంది. 
చదువులోనూ..
ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న మాధవీలత ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టింది. ఆమె తండ్రి పార్ధసారధి రాజు గవర్నమెంట్ టీచర్‌‌‌‌. దాంతో ఆమె చదువంతా తండ్రి టీచర్గా పనిచేస్తున్న స్కూళ్లలోనే సాగింది. చదువు పూర్తయ్యాక చెన్నైలోని మల్టీ నేషనల్‌‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆమెకు. మంచి ఉద్యోగం.. జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో మరో  సమస్య వచ్చిపడింది. పోలియో కారణంగా వెన్నెముక పైన భారం పడటం మొదలైంది. ఆ ప్రభావం ఊపిరితిత్తులపై కూడా పడింది. ‘ఆపరేషన్‌‌ చేస్తే గ్యారెంటీ ఇవ్వలేం. చేయకపోతే ఏడాదికి మించి బతకవు’ అన్నారు డాక్టర్లు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు ‘హైడ్రో థెరపి’ గురించి తెలిసింది. అంటే.. నీళ్లలో ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం. మనిషి బయటికంటే నీళ్లలో బరువు తక్కువగా ఉంటాడు. అలా నీళ్లలో దిగి కాళ్లు, చేతులు కదుపుతూ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం అన్నమాట. అలా కొన్ని రోజులు చేశాక ఆమెపై ఆమెకు నమ్మకం రావడంతో స్విమ్మింగ్‌‌లో కోచింగ్‌‌ తీసుకోవాలనుకుంది. కానీ, కోచ్‌‌లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమే సొంతంగా నేర్చుకుంది.  అలా 2007 నుంచి 2011 మధ్యలో జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించింది. అక్కడితో ఆగకుండా తమిళనాడు పారాస్విమ్మింగ్‌‌ అసోసియేషన్‌‌ సాయంతో మరో 300 మందికి పారా స్విమ్మింగ్‌‌ని పరిచయం చేసింది.    
‘ఎస్‌‌, వీ టూ కెన్’
“దివ్యాంగులు కూడా స్పోర్ట్స్‌‌ ఆడొచ్చని, నాకు ఒకప్పుడు తెలియలేదు. నాలాగ తెలియని వాళ్లకు దీని గురించి చెప్పాలనే 2011 నుంచి ‘‘ఎస్, వీ టూ కెన్” పేరుతో మూమెంట్‌‌  స్టార్ట్ చేశా. ‘వీల్ చెయిర్‌‌‌‌ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ద్వారా చాలా రాష్ట్రాల్లో వీల్‌‌ఛైర్‌‌‌‌ బాస్కెట్‌‌ బాల్‌‌ ఇంట్రడ్యూస్‌‌ చేశా. మన దేశం నుంచి పారాలింపిక్స్‌‌కి  టీమ్‌‌ స్పోర్ట్స్‌‌కి ఎవరూ వెళ్లలేదు. అందుకే, వీల్‌‌చెయిర్‌‌‌‌ బాస్కెట్‌‌బాల్‌‌ కోసం టీమ్‌‌ రెడీ అయితే బాగుంటుంది. వచ్చే పారాలింపిక్స్‌‌లో మన దేశం తరఫున ఒక జట్టు ఆడితే చూడాలనేది కోరిక. ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విషయాలను పదిమందికి చెప్పాలనే ఉద్దేశంతో ‘‘స్విమ్మింగ్ ఎగైనెస్ట్ ది టైడ్” అనే పుస్తకాన్ని రాశా. అది తెలిసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెన్నైకి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానిం చారు. నా పుస్తకాన్ని చదివి మెచ్చుకుని, నాకు ప్రశంసా పత్రాన్ని పంపించారు”. 
మాధవీలత సాధించిన విజయాలు 
  2011లో జరిగిన 11వ నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలు. 
  2012 లో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రెండు రజత, రెండు కాంస్య పతకాలు.
  2013  జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌‌షిప్ పోటీలో ఒక రజతం, మూడు కాంస్య పతకాలు. 
   2014లో జాతీయ పారాలింపిక్‌‌ స్విమ్మింగ్‌‌ ఛాంపియన్‌‌షిప్‌‌లో నాలుగు ‌‌బంగారు పతకాలు.
   2015 జాతీయ పారాలింపిక్‌‌ స్విమ్మింగ్‌‌లో మూడు బంగారు పతకాలు. 
   రాష్ట్ర స్థాయి పోటీల్లో మరో పన్నెండు బంగారు పతకాలు వచ్చాయి.
::: గట్టికొప్పుల ప్రశాంత్ రెడ్డి, ఖమ్మం, వెలుగు