
దీపావళి అంటే ప్రజల పండుగ.ప్రజలు విజయం సాధించిన పండుగ.స్వార్థానికి దూరంగా ఒక తల్లి.. పరిపాలకుల చేత దుష్ట సంహారం చేయించిన పండుగ. మనం మంచిని నేర్చుకోవలసిన పండుగ.సాధారణంగా దీపావళి వస్తోందనగానే నరకాసురుడే గుర్తుకు వస్తాడు. దీపావళి ముందు రోజును ‘నరక చతుర్దశి’గా జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నరకుడిని సత్యభామ సంహరించిన రోజు. ఒక మాతృమూర్తి.. దుష్టాత్ముడైన తన కుమారుడిని.. నిస్వార్థంగా సంహరించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఇది సత్యభామ పండుగ.
కథలోకి వెడదాం...
నరకుడు అత్యంత దుర్మార్గుడు. మహర్షులను, బ్రాహ్మణులను, స్త్రీలను, శిశువులను, గోవులను, దేవతలను... సకల సజ్జన సమూహాన్ని హింసిస్తున్నాడు. వారంతా కలిసి ఒకనాడు శ్రీకృష్ణునికి తమ బాధను మొరపెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు వారికి అభయమిచ్చి, నరకాసుర సంహారానికి సన్నద్ధుడయ్యాడు. ఊహించని విధంగా సత్యభామ.. ‘కృష్ణా! నీ వెంట నేను కూడా యుద్ధానికి వస్తాను’ అని తన మనసులోని కోరికను బయటపెట్టింది. యుద్ధ రంగం గురించి సత్యభామకు పరిపరివిధాల చెప్పి, ఆమెను నివారించబోయాడు. ‘అబలవైన నువ్వెక్కడ? రణరంగమెక్కడ? అక్కడ నీకు... భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు వినపడతాయి. శత్రువుల శూలాలు ఖడ్గాలు ఆయుధాలకు ప్రాణాలు విడిచేవారు కపడడతారు. అటువంటి యుద్ధరంగానికి నీవు రావటం తగనిపని’ అని పలికాడు.
సత్యభామ ఏ మాత్రం పట్టువిడువక, ధైర్యంగా, ‘నువ్వుండగా నాకేం భయం. నేను నీతో వస్తాను’ అని గట్టిగా పట్టుపట్టింది. ఎట్టకేలకు శ్రీకృష్ణుడు అంగీకరించాడు. సంతోషంగా సత్యభామ బయలుదేరింది. ప్రజలను బాధించిన నరకుడిని వధించింది. సత్యభామ సాక్షాత్తు భూదేవి అవతారం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. నరకుడు భూదేవి కుమారుడే. తన కుమారుడి కారణంగా ప్రజలకు హాని జరుగుతుండటం చూసింది. పరిపాలకులకు ప్రజలు కన్నబిడ్డలతో సమానం. నరకుడు తన కుమారుడే అయినప్పటికీ, ప్రజలను కాపాడవలసిన బాధ్యతను ఆవిడ విస్మరించలేదు. దుష్టుడైన తన కుమారుడిని సంహరించింది. తన ప్రజలను కాపాడింది సత్యభామ.ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో తన కుమారులు చేసిన తప్పులకు ఎన్నడూ అడ్డుపడలేదు. పాండవుల సంపదలను హరించిన సందర్భంలోనూ మారుమాటాడలేదు. ఇంటి కోడలు ద్రౌపదిని నిండు కొలువులోకి ఈడ్చుకొనివచ్చి, వస్త్రాపహరణం చేసిన సందర్భంలోనూ మందలించలేదు. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్న చందాన.. తన పుత్రులు ఎన్ని తప్పులు చేసినా, సమర్థించాడే తప్ప, మందలించలేదు. ‘ఇలా చేయడం తప్పు’ అని విదురుడు చెబితే, కోపం తెచ్చుకున్నాడే కానీ, పాండవుల పట్ల న్యాయంగా ప్రవర్తించలేదు.
ఇక ద్రోణాచార్యుడి విషయానికి వస్తే
అశ్వత్థామ తన కుమారుడే అయినప్పటికీ... సకల అస్త్రశస్త్ర విద్యలను తన శిష్యుడైన అర్జునునికే బోధించాడు. నేర్చుకున్న విద్యను దుర్వినియోగం చేసేవారి వల్ల అందరికీ నష్టం వాటిల్లుతుంది. అర్జునుడు ఒక్కడే శస్త్రాస్త్రాలను సద్వినియోగం చేయగలిగిన వీరుడని అర్థం చేసుకున్న ద్రోణాచార్యుడు అర్జునుడికే అన్నీ నేర్పాడు. అస్త్రాలను దుర్వినియోగం చేస్తున్నాడు కనుకనే ఏకలవ్యుడి కుడి చేతి బొటన వేలిని గురుదక్షిణగా కోరాడు. ద్రోణాచార్యుడు పుత్రప్రేమకు, ప్రలోభాలకు లొంగిపోయి ఉంటే, ఎన్నో ఉత్పాతాలు జరిగి ఉండేవి. క్షణ కాలంలో సర్వ మానవాళిని నాశనం చేయగల పాశుపతాస్త్రం తన దగ్గర ఉన్నప్పటికీ, అర్జునుడు దానిని మానవ వినాశనానికి వాడకూడదని శివుడు చెప్పిన మాటను అనుసరించాడు. లేదంటే కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రాన్ని ప్రయోగించి, అందరినీ క్షణకాలంలో నాశనం చేసి ఉండేవాడు. అందుకే ద్రోణుడు తన విద్యలను శిష్యుడైన అర్జునుడికి బోధించాడే కాని, స్వయంగా కుమారుడైన అశ్వత్థామకు చెప్పలేదు.
పరిపాలకులకు స్వార్థం ఉండకూడదని ఈ కథలన్నీ చెబుతున్నాయి.
సాధారణంగా తల్లికి కన్న సంతానం మీద మమకారం అధికంగా ఉంటుంది. కాని సత్యభామ తాను తల్లిని అనే విషయాన్ని పక్కన ఉంచి, తమ ఏలుబడిలో ప్రజల క్షేమం కోసం ఆలోచించింది. శ్రీకృష్ణునితో కలిసి నరకాసుర వధ పూర్తి చేసింది. పరిపాలకులు నిస్వార్థంగా ఉండాలనడానికి ఈ కథలు ఉదాహరణగా నిలుస్తాయి.