
మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో హైవేలు మరింత విశాలంగా మారున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మించిన రెండులైన్ల జాతీయ రహదారులు ఇక నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా, 563 హైవే పై మరిపెడ, తొర్రూరు పట్టాణాల గుండా, 365 హైవే మరిపెడ, కురవి, గూడూరు, మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి వెళ్తుండగా, ఈ ప్రాంతాల్లో బైపాస్ ఏర్పాటు చేస్తారా లేదా విస్తరణ చేపడతారా అనేది సందిగ్ధం నెలకొన్నది.
జిల్లా నలువైపులా హైవేల విస్తరణ..
మహబూబాబాద్ కు నలువైపులా హైవేల విస్తరణ కొనసాగుతుండటంతో జిల్లా ప్రజలతో పాటుగా ఇతర ప్రాంతాలవారికి రవాణా సులభతరం కానున్నది. నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి కేంద్రమే నిధులు మంజూరు చేసి ఆ పనులను 2028 వరకు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు వరుసల మధ్యలో రహదారి పొడవునా డివైడర్ ఏర్పాటుతో ప్రమాదాలు తగ్గనున్నాయి. కూడళ్లు అభివృద్ధి
చెందనున్నాయి.
నకిరేకల్ నుంచి365 హైవే జిల్లాలో మరిపెడ మండలం తానంచర్ల నుంచి, సీరోలు, కురవి, మహబూబాబాద్, గూడురు మండలం భూపతిపేట వరకు 70 కిలోమీటర్ల మేరకు జిల్లాలో విస్తరణ జరుగుతూ మల్లంపల్లి, ములుగు వరకు వెళ్తుంది. 181 కిలోమీటర్ల మేర రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు.
వరంగల్_ఖమ్మం 563 హైవేను 119 కిలో మీటర్ల వరకు నాలుగులైన్లుగా విస్తరించనున్నారు. జిల్లాలో తొర్రూరు మండలం నాంచారి మడూరు నుంచి మరిపెడ మండలం మాదిరిపురం వరకు విస్తరణ జరగనుంది.
హైదరాబాద్ సమీపంలోని గౌరెల్లి నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వరకు 930-పీ జాతీయ రహదారి నిర్మాణ పనులు నడుస్తున్నాయి. జిల్లాలోని పెద్దవంగర మండలం నుంచి తొర్రూరు మండల బార్డర్ వరకు రోడ్డు పనులు చేపట్టారు. మిగిలిన భాగం పనులు చేపట్ట వలసి ఉంది. పెద్దవంగర నుంచి తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, బయ్యారం మండలంలోని గంధంపల్లి వద్ద ముగియనుంది. ఈ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న, నాగ్పూర్_ విజయవాడ, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నాలుగు లైన్ల రహదారి (ఎన్హెచ్ 163జీ), జిల్లాలో కేసముద్రం మండలం ఉప్పపల్లి నుంచి, ఇనుగుర్తి, నెల్లికుదురు, చిన్నగూడురు, కురవి, డోర్నకల్ మండలాల నుంచి ఖమ్మం రూరల్ మండలం నుంచి ఆ జిల్లాకు వెళ్లనుంది. జిల్లాలో భూ సేకరణ పూర్తి కావడంతో నిర్మాణ పనులు వేగంగా
కొనసాగుతున్నాయి.