పాలమూరు మేయర్ పీఠం బీసీ మహిళకు

పాలమూరు మేయర్  పీఠం బీసీ మహిళకు
  • రిజర్వేషన్లు ఖరారు చేసిన మున్సిపల్​ శాఖ
  • ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సగం స్థానాలు బీసీలకు రిజర్వ్​

మహబూబ్​నగర్, వెలుగు: కార్పొరేషన్, మున్సిపల్​ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను స్పీడప్​ చేస్తోంది. కొద్ది రోజుల కింద డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్టును రిలీజ్​ చేయగా.. మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పించింది. పొలిటికల్​ పార్టీలతో సమావేశాలు, ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించి.. ఇటీవల ఫైనల్​ ఓటరు లిస్ట్​ను కూడా రిలీజ్​ చేసింది. ఈ క్రమంలో తాజాగా మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది.

ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్​ శనివారం రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు విడదల చేశారు. ఇందులో మొదటి సారి ఎన్నికలు జరిగే మహబూబ్​నగర్​ మేయర్​ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్​ చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 20 మున్సిపాలిటీలు ఉండగా.. 10 మున్సిపాలిటీలు బీసీ జనరల్, బీసీ మహిళలకు అలాట్​ చేశారు. తొమ్మిది మున్సిపాలిటీలను జనరల్, జనరల్​ ఉమెన్​కు కేటాయించగా.. ఒక స్థానాన్ని ఎస్టీ జనరల్​కు కేటాయించారు. 

మూడు స్థానాలు బీసీలకే..

మహబూబ్​నగర్​ మున్సిపాలిటీని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ చేసింది. గతంలో 47 వార్డులు ఉండగా, 60 డివిజన్లతో కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ చేసింది. అలాగే దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం మేజర్​ గ్రామ పంచాయతీగా ఉండగా.. 12 వార్డులతో మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. కొడంగల్​ నియోజకవర్గంలోని మద్దూరు మేజర్​ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేశారు. మొత్తం 16 వార్డులతో ఈ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే.. కొత్తగా ఏర్పాటైన ఈ మూడు స్థానాలను మున్సిపల్​ శాఖ బీసీలకు రిజర్వ్​ చేసింది. ఇందులో మహబూబ్​నగర్​ కార్పొరేషన్​కు మొదటి సారి జరిగే ఎన్నికలో మహిళా నేత మేయర్​ పీఠాన్ని 
అధిష్టించనున్నారు.

చైర్మన్ల రిజర్వేషన్లు ఇలా..

భూత్పూర్(ఎస్టీ జనరల్), అయిజ(బీసీ జనరల్), వడ్డేపల్లి(బీసీ జనరల్), అలంపూర్(బీసీ జనరల్), నాగర్​కర్నూల్(బీసీ జనరల్), మద్దూరు(బీసీ జనరల్), దేవరకద్ర(బీసీ ఉమెన్), కొల్లాపూర్(బీసీ ఉమెన్), అచ్చంపేట(బీసీ ఉమెన్), కొత్తకోట(బీసీ ఉమెన్), ఆత్మకూరు(బీసీ ఉమెన్), జడ్చర్ల(జనరల్), కోస్గి(జనరల్), మక్తల్(జనరల్), అమరచింత(జనరల్), పెబ్బేరు(జనరల్), గద్వాల(జనరల్​ మహిళ), కల్వకుర్తి(జనరల్​ మహిళ), నారాయణపేట(జనరల్​ మహిళ), వనపర్తి(జనరల్​ మహిళ)కు కేటాయించారు.