
- ఆయుధాలు వీడాలనేది నంబాల బతికుండగా తీసుకున్న నిర్ణయం
- అనవసర త్యాగాలు వద్దు.. నూతన పద్ధతిలో పురోగమిద్దామని పిలుపు
హైదరాబాద్, వెలుగు:
ఆయుధాలు వీడి క్యాడర్ను కాపాడుకుందామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ అలియాస్ అభయ్ పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడాలనేది పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు బతికుండగా తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు.
ఇటీవల తనకు వ్యతిరేకంగా జగన్ ఇచ్చిన ప్రకటనకు కౌంటర్‌గా 22 పేజీలతో కూడిన మరో లేఖను మల్లోజుల సోమవారం రిలీజ్ చేశారు. మావోయిస్ట్ పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమని.. అనవసర త్యాగాలు వద్దని లేఖలో పేర్కొన్నారు.
జగన్ కౌంటర్‌కు.. మల్లోజుల రీ కౌంటర్..
మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి సాయుధ పోరాటాన్ని వీడాలని, దీనిపై పార్టీ సభ్యులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ మీడియాకు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొద్ది రోజులకే పార్టీ తరఫున అధికార ప్రతినిధి జగన్లేఖ నుంచి రిలీజైంది. ఆయుధాలు వీడాలనే అంశం అభయ్ వ్యక్తిగతమని.. ఇది పార్టీ నిర్ణయం కాదని అందులో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించాలని, లేకుంటే పీపుల్స్ గెరిల్లా స్వాధీనం చేసుకుంటుందని అందులో హెచ్చరించారు. దీంతో మావోయిస్టు పార్టీలో అంతర్యుద్ధం మొదలైందన్న భావన ప్రజల్లోకి వెళ్లింది. మళ్లీ ఇప్పుడు జగన్‌కు కౌంటర్ ఇస్తూ మల్లోజుల మరో లేఖ రిలీజ్చేశారు.
పార్టీ పంథానే తప్పు అంటున్న మల్లోజుల
మల్లోజుల రాసిన 22 పేజీల లేఖలో సాయుధ పోరాట విరమణపై స్పష్టత ఇచ్చారు. మావోయిస్టు పార్టీ పంథానే తప్పు అని అందులో పేర్కొన్నారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తున్నదని, ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామని క్షమాపణలు చెప్పారు. పార్టీ క్యాడర్ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని చెప్పారు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని ఆయన సూచించారు.
వర్తమాన ఫాసిస్టు పరిస్థితుల్లో మన లక్ష్యాన్ని నెరవేర్చలేమని అందులో మల్లోజుల పేర్కొన్నారు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యమంలో ఉన్నవారికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తామనుకోవడం సరికాదన్నారు. ‘ఇన్నాళ్లు ఆ అద్భుతాలు ఎందుకు సృష్టించలేకపోయాం? అసలు మనం ఎక్కడ గాడి తప్పాం.. ఆయుధాలు వీడొద్దంటున్న వాళ్లు చెప్పాలి. అద్భుతాలు చేయడం ఇక ఎవరివల్లా కాని పని. ఆ పనే మన పార్టీ చేయగలిగి ఉంటే.. ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు మనలో సానుకూల మార్పు రావాలి. క్యాడర్ను రక్షించుకోవాలి. అనవసర త్యాగాలు వద్దు. నూతన పద్ధతిలో పురోగమిద్దాం. అంతిమ విజయం ప్రజలదే’ అని లేఖలో మల్లోజుల పేర్కొన్నారు.
మల్లోజుల లొంగుబాటుపై జరుగుతున్న చర్చ
మల్లోజుల లేఖను బట్టి ఆయన త్వరలోనే పోలీసులకు లొంగిపోతారనే చర్చ జరుగుతున్నది. మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి 31లోపు తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం.. ఈ మేరకు కేంద్ర బలగాలు మావోయిస్టులను వెంటాడి ఎన్కౌంటర్లు చేస్తుండడం.. చాలా మంది పెద్దస్థాయిలో ఉన్న వాళ్లు కూడా ఎన్ కౌంటర్ లో చనిపోతుండడం వంటి పరిణామాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. సాయుధ పోరాట విరమణపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ త్వరలోనే లొంగిపోయే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతున్నది.