- జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలో నిరాయుధులుగా పట్టుకున్న 16 మంది మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టుపార్టీ కోరింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో బుధవారం ఓ లేఖను రిలీజ్ చేశారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బవంటివన్నారు. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి మద్దతు ఒవ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.
ఇతర ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు నుండి కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగేందుకు వీలుగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలోని కకర్ బుడ్డీ, బాజ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న తమ సహచరులను 16 మందిని అరెస్టు చేసినట్టుగా జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు గ్రామస్తులు ఉన్నట్టు చెప్పారు.
