మావోయిస్టు అగ్రనేత ఆర్కే చనిపోయినట్లు ప్రచారం

మావోయిస్టు అగ్రనేత ఆర్కే చనిపోయినట్లు ప్రచారం

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ రామకృష్ణ అలియాస్‌ సాకేత్‌ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమార్- బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం పరిధిలోని దక్షిణ బస్తర్‌లో ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సరైన వైద్యానికి నోచుకోక పరిస్థితి విషమించి చనిపోయినట్లు చెబుతున్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆర్కే మృతి చెందారని చత్తీస్‌గఢ్‌ పోలీసులు చెబుతున్నప్పటికీ నిర్ధారణ కాలేదు.  
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత  మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో నక్సల్స్‌ తరఫున ప్రభుత్వంతో శాంతి చర్చల్లో ఆర్‌కె పాల్గొన్న విషయం తెలిసిందే. చర్చల అనంతరం ఆయన తిరిగి మావోయిస్టు దళాన్ని వెంటబెట్టుకుని అజ్ఘాతంలోకి వెళ్లిపోయారు.  2018 మే నెలలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఆర్కే తృటిలో తప్పించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ౩౦ మంది మావోయిస్టులు మృతి చెందడం సంచలనం సృష్టించింది. అజ్ఞాతంలోనే ఉంటున్న ఆర్కే.. కరోనా తొలిసారిగా ప్రబలినప్పుడు అనారోగ్యం బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండో వేవ్ లోనూ పలువురు కరోనా బారినపడినట్లు వార్తలు వినిపించినా ఆర్కే గురించిన సమాచారం నిర్ధారణ కాలేదు. 
నాలుగు రాష్ట్రాల హిట్ లిస్టులో ఆర్కే
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు జోనల్‌ కమిటీకి సలహాదారుగా, ఇంఛార్జిగా వ్యవహరించిన ఆర్కే.. మొత్తం నాలుగు  రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో ఉన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేపై 40 లక్షల రివార్డును ప్రకటించగా.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం 25 లక్షలు, ఒడిశా ప్రభుత్వం 20 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం 12 లక్షల రివార్డులు ప్రకటించాయి. 

విద్యార్థి దశలోనే రాడికల్స్ ఉద్యమం వైపు.. 
ఆర్కే అలియాస్ రామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామం. ఈయన తండ్రి సత్యనారాయణ ఉపాధ్యాయునిగా పనిచేశారు. మాచర్ల  ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రాడికల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అటు తర్వాత తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న పుడు రాడికల్ విద్యార్థి సంఘం నుండి పీపుల్స్ వార్ లో జాయిన్ అయ్యారు. గుంటూరు జిల్లాకు తిరిగొచ్చి దాచేపల్లి మండలం గ్రామాల పాడు గ్రామంలో కొంతకాలం  పీపుల్స్ వార్ కార్యకలాపాలు కొనసాగించారు . పీపుల్స్ వార్ పై నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2004లో ముఖ్యమంత్రి వై.ఎస్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం  మావోయిస్టులతో చర్చలకు ఆహ్వానించగా  పీపుల్స్ వార్ అగ్ర నేతగా ఉన్న రామకృష్ణ కూడా ఇతర తీవ్రవాద సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతం వద్ద.. శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. కొన్ని దశాబ్దాల పాటు ఆచూకీ లేకుండా పోయిన రామకృష్ణని చర్చల సందర్భంగా అందరికీ సుపరిచితం అయ్యారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆర్ కె కి సంబంధించిన సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు.