గేమింగ్ జోన్‌‌లో భారీ అగ్నిప్రమాదం .. 27 మంది సజీవదహనం

గేమింగ్ జోన్‌‌లో భారీ అగ్నిప్రమాదం ..  27 మంది సజీవదహనం
  • మృతుల్లో 9 మంది చిన్నారులు
  • గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌‌లో ఘోరం
  • దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం భూపేంద్ర పటేల్
  • మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన
  • ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

రాజ్‌‌‌‌కోట్‌‌‌‌:  గుజరాత్‌‌‌‌లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లోని యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తికి చెందిన టీఆర్‌‌‌‌పీ గేమింగ్ జోన్‌‌‌‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో  9 మంది చిన్నారులతో సహా 27 మంది సజీవదహనం అయ్యారు. గాయపడిన మరికొందరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్పందిస్తూ.. ఘటనా స్థలం నుంచి దాదాపు 20 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నమని చెప్పారు. 

వేసవి సెలవులతోపాటు వీకెండ్ కావడంతో  చాలా మంది తమ పిల్లలతో కలిసి టీఆర్‌‌‌‌పీ గేమింగ్ జోన్‌‌‌‌కు వచ్చారని తెలిపారు. మంటలు అంటుకోవడంతో  గేమింగ్ జోన్‌‌‌‌ కాలిపోయిందన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేస్తామన్నారు. ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తామన్నారు. ఘటనాస్థలంలో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సాయం అందించాలని రాజ్‌‌‌‌కోట్‌‌‌‌ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లకు సూచించారు. 

నలుగురు అరెస్ట్

పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్‌‌‌‌కోట్‌‌‌‌ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ తెలిపారు. గేమింగ్ జోన్‌‌‌‌తో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోయాయని చనిపోయినవారిని గుర్తించడం కష్టంగా ఉందని తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌‌‌‌మార్టం కోసం ఆసుపత్రికి పంపినట్లు వివరించారు. రెస్క్యూ కార్యకలాపాలను పూర్తి చేసిన తర్వాత ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. 

ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి

రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో ఫోన్ లో మాట్లాడి..ఘటనా స్థలంలో పరిస్థితిపై ఆరా తీశారు. గేమింగ్ జోన్‌‌‌‌ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయాలతో బయటపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.