పిజ్జా, బర్గర్లలో టమాటాలు ఇవ్వలేం : మెక్ డోనాల్డే ఇలా చెబితే..

పిజ్జా, బర్గర్లలో టమాటాలు ఇవ్వలేం : మెక్ డోనాల్డే ఇలా చెబితే..

పిజ్జా, బర్గర్ అంటే కూరగాయల ముక్కలు వేస్తారు.. టమాటా అనేది కామన్. అయితే ధరలు పెరిగిన క్రమంలో.. ప్రముఖ పిజ్జా, బర్గర్ తయారీ కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి టమాటా లేకుండా బర్గర్, పిజ్జాలు ఇస్తామని.. ధరలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. లక్షల కోట్ల టర్నోవర్ చేసే పెద్ద పెద్ద కంపెనీలే ఇలా చెప్పాయంటే.. టమాటా ధరలు ఎంతలా భయపెడుతున్నాయో అర్థం అవుతుంది.

సీజనల్ సమస్యలు, దాని వల్ల ఏర్పడే సేకరణ ఇబ్బందుల కారణంగా మెను ఐటెమ్‌ల నుంచి టమాటాలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ ఇండియా నార్త్ అండ్ ఈస్ట్ ఇటీవల ప్రకటించింది. పెరుగుతున్న టమాటా ధరలను కంపెనీ స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ, భారతదేశంలో భారీ వర్షపాతం వాటి ధరలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. దీని వల్ల టమాటా సరఫరా, రవాణా, పంట నాణ్యతపై ప్రభావం పడింది.

ఆహార నాణ్యత, భద్రతకు సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను పాటించడంలో తాము ఎంతో నిబద్ధతగా ఉంటామని మెక్‌డొనాల్డ్స్ ఇండియా - నార్త్ అండ్ ఈస్ట్ కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. అందులో భాగంగానే తాము మెనూ నుంచి టమాటాలను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దాంతో పాటు ఇది ఒక టెంపరరీ సమస్యేనని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా తమ మెనూలో టమాటాలను తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు.