మెదక్‌‌ మండల్‌‌ రాజ్‌‌పల్లి గ్రామంలో దారుణం.. తాగేందుకు డబ్బులివ్వలేదని తల్లిని చంపిండు

మెదక్‌‌ మండల్‌‌ రాజ్‌‌పల్లి గ్రామంలో దారుణం.. తాగేందుకు డబ్బులివ్వలేదని తల్లిని చంపిండు

మెదక్​టౌన్, వెలుగు : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన తల్లిని చంపేశాడు. ఈ ఘటన మెదక్‌‌ మండలం రాజ్‌‌పల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. మెదక్‌‌ రూరల్‌‌ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి నర్సమ్మ (75) తన కుమారుడు రాములు వద్ద ఉంటోంది. మద్యానికి బానిసైన రాములు ఆదివారం డబ్బులు, బంగారం ఇవ్వాలని తల్లి నర్సమ్మను అడుగగా.. ఆమె ఒప్పుకోలేదు. కొద్దిసేపటి తర్వాత మద్యం తాగి వచ్చిన రాములు కర్రతో తల్లిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింగం తెలిపారు.  

నగల కోసం తల్లిపై హత్యాయత్నం

కామారెడ్డిటౌన్‌‌, వెలుగు : నగలు ఇవ్వడం లేదన్న కోపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన తల్లిపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్యారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలోని ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో కంచర్ల శంకర్‌‌, అతడి భార్య గౌరవ్వ పనిచేస్తున్నారు. వారి కొడుకు కంచర్ల రాజేశ్‌‌ పంచముఖి హనుమాన్‌‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం రాజేశ్‌‌ తన తల్లి గౌరవ్వ వద్దకు వచ్చి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు అమ్మి పైసలు ఇవ్వాలని కోరాడు.

ఆమె ఒప్పుకోకపోవడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజేశ్‌‌ తల్లిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆమె భర్త శంకర్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.