
- అగ్రికల్చర్ ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశాలు
- రేషన్‌కార్డులకు సన్నబియ్యం కొరత రాకుండా ముందస్తు చర్యలు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఖరీఫ్ సీజన్ పనులు రెండు వారాల్లో షురూ కానుండగా.. అధికారులు సన్నరకం వరిసాగుకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ సారి మొత్తం 5.62 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనాలు రూపొందించగా అందులో 4.37 లక్షల ఎకరాలు వరి సాగవుతుందని భావిస్తున్నారు. వరి సాగులో సన్నరకమే పూర్తిగా ఉండేలా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లాన్ రెడీ చేశారు.
రేషన్ కార్డులున్న పేదలకు సర్కార్ సన్నబియ్యం అందిస్తున్నందు వల్ల ఆ రైస్ పంపిణీకి మున్ముందు ఎక్కడా కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. గత ఖరీఫ్‌లో ఎంఎస్పీకి తోడు గవర్నమెంట్ రూ.500 బోనస్ రైతులకు ఇచ్చింది. యాసంగిలో కూడా సన్నవడ్లకు ఇస్తామని ప్రకటించగా ఆఫీసర్లు బిల్స్తయారు చేసి పంపారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి బోనస్ విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా సన్నరకం వరి సాగు వైపే అన్నదాతలను ప్రోత్సాహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.
సర్ప్లస్ ఉన్నప్పటికీ అలర్ట్‌గా..
జిల్లాలో 4,02,217 రేషన్‌కార్డులుండగా ప్రతినెలా 8,248 మెట్రిక్ టన్నుల బియ్యం 13,14,456 మందికి అందిస్తున్నారు. మరో పక్క కొత్త కార్డులు శాంక్షన్ చేసే కసరత్తు నడుస్తుంది. దీంతో మున్ముందు నెలవారీ రైస్ కోటా కూడా గణనీయంగా పెరుగనుంది. ఏప్రిల్ నుంచి రేషన్కార్డులున్న పేదలందరికీ గవర్నమెంట్ సన్నబియ్యం అందిస్తోంది. దీంతో రేషన్‌షాప్ ల్లో పది రోజుల్లోపే సన్నబియ్యం తెచ్చుకుంటున్నారు. యాసంగిలో గవర్నమెంట్ 7.92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు రైతుల నుంచి కొనుగోలు చేయగా అందులో సన్నాలు 7.20 లక్షల టన్నులు ఉన్నాయి.
ఎనిమిది నెలలకు సరిపడా..
బఫర్ స్టాక్ కలిపితే ప్రస్తుతం ఇందూర్ జిల్లాలో మరో ఎనిమిది నెలలకు సరిపడ సన్న బియ్యం నిల్వలు ఉండగా రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, మెదక్జిల్లాల అవసరాలకు ఇక్కడి బియ్యంను సివిల్‌సప్లయి ఆఫీసర్లు పంపుతున్నారు. మున్ముందు పంపిణీ చేసే సన్న బియ్యంకు కొరత రాకుండా సన్నరకం వరిసాగు వైపు రైతులను రెడీ చేసే సంకల్పంతో అధికార యంత్రాంగం ప్లాన్ రెడీ చేసింది. మార్కెట్ డిమాండ్ కూడా పరిగణలోకి తీసుకొని సన్నాలనే సాగు చేయించేందుకు ప్రిపేర్ అయ్యారు.
ఏఈవోలపై బాధ్యత
నోటిఫై చేసిన 33 రకాల సన్నరకం వడ్లకు 2024-– 25 ఖరీఫ్‌లో రూ.120 కోట్లను బోనస్ రూపంలో గవర్నమెంట్ జిల్లా రైతులకు చెల్లించింది. ప్రస్తుత యాసంగిలో రూ.1,840 కోట్ల విలువ వడ్లను ఇప్పటికే కొనుగోలు చేసిన సర్కార్ రూ.500 చొప్పున బోనస్ పేమెంట్‌కు ఏర్పాట్లు చేస్తోంది. బోనస్ కారణంగా రెండు సీజన్లలో జిల్లాలో సన్నరకం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాగా 2025-–26 ఖరీఫ్ సీజన్‌కు బోనస్ ఇవ్వడంపై పాలకుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
అయినప్పటికీ రైతులు సన్నాల వైపే ఆసక్తి చూపించేలా చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. 33 రకాల నోటిఫైడ్ సీడ్ రైతులకు అందుబాటులో పెట్టి నారుమడి వేయించడానికి ఏఈవోల ద్వారా ఏర్పాట్లు చేశారు. రైతు వేదికలు ఉపయోగించుకొని విస్తృత ప్రచారం చేయనున్నారు. జిల్లాలో ఇతర డివిజన్ల కంటే వరినాట్లు ముందుగా వేసే బోధన్ డివిజన్లో ఈ రకంగా నారు పోయించారు.