
- ఇదే అంశాన్ని సుప్రీం కోర్టులో వాదించాలి
- డిప్యూటీ సీఎం, మంత్రులకు కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకెళ్లామని, ఇదే అంశాన్ని అడ్వకేట్లకు చెప్పి సుప్రీంకోర్టులో బలంగా వాదించేలా దిశానిర్దేశం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రులను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘రిజర్వేషన్ల పెంపు అంశంలో కులగణన చేసి ఎంపరికల్ డేటా సేకరించాలని.. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని.. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని.. ఇలా ట్రిపుల్ టెస్ట్ ద్వారా రిజర్వేషన్లను పెంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీని ప్రకారమే మనం ముందుకు వెళ్లాం. ఈ అంశాన్ని అడ్వకేట్ ఆన్ రికార్డ్ తో చర్చించాలి” అని వారు సూచించారు. ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు కేసు, ఈ నెల 8న హైకోర్టులో విచారణ అంశాలపై చర్చించారు.