వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సుంకిశాల పూర్తి చేయాలి

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సుంకిశాల పూర్తి చేయాలి
  • అధికారులకు మెట్రో వాటర్​ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం
  • పైపులైన్​ విస్తరణ పనులు వేగవంతం చేయాలని సూచన


హైదరాబాద్ ​సిటీ, వెలుగు: జంటనగరాలకు కృష్ణాజలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెల్ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని అధికారులను మెట్రోవాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మేఘా ఇంజనీరింగ్ సీఈఓ, డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు, టీసీఎస్, గేట్ల ఎక్స్ పర్ట్ కన్నయ్య నాయుడు, ఇతర నిపుణులతో కలిసి ఆయన సుంకిశాల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ..వర్షాకాలం సమీపించిన తరుణంలో పైపులైన్​విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

 రిటైనింగ్ వాల్ శిథిలాలను తొలగించి  పునర్నిర్మాణం పనులు మొదలు పెట్టాలని చెప్పారు.  దానికి సంబంధించిన డిజైన్ లు, డ్రాయింగ్ లను 15 రోజుల్లోగా ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎక్స్​పర్ట్స్​తో కలిసి సుంకిశాల పునర్నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రీడిజైనింగ్ వివరాలను చర్చించారు. శిథిలాల తొలగింపు తర్వాత సివిల్ వర్క్ లు, కంట్రోల్ రూం పనులను వేగంగా ముగిస్తే సైడ్ వాల్ పునర్నిర్మాణానికి మార్గం సులభవుతుందని అంచనా వేశారు. 

అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైపు ఉన్న టన్నెలింగ్ ప్లగ్గింగ్ పనులను అధికారులు పరిశీలించారు. ప్రతి టన్నెలింగ్ వద్ద గేట్ల నిర్మాణం, డిజైన్లు, గేట్ల రూపుకల్పనపై చర్చించారు. ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సిజీఎం మహేశ్ కుమార్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు శశిధర్, సురేంద్రనాథ్, టీసీఈ ప్రతినిధి నితీశ్ తదితరులు పాల్గొన్నారు.