Telagana Kitchen: చిరుధాన్యాలు.. సామలతో వెరైటీ ఫుడ్..రుచి అదిరిద్ది.. ఎంతో బలం కూడా..!

Telagana Kitchen:  చిరుధాన్యాలు.. సామలతో వెరైటీ ఫుడ్..రుచి అదిరిద్ది.. ఎంతో బలం కూడా..!

చిరుధాన్యాలంటే జొన్నలు, రాగులు అనుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కూడా బాగానే వాడుతున్నారు. కానీ సామలు, కొర్రలు, అరికెలు, పరిగెలు, ఊదలు.... ఇలా చిరుధాన్యాలున్నాయి. వీటి గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. కానీ, ఒకప్పుడు ఇవన్నీ ఆహారంలో ప్రధాన భాగం, చిరుధాన్యాల స్పెషల్స్​  సామలుతో ఎలాంటివి తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. . .!

సామలతో పాలతాలికలు తయారీకి కావలసినవి

  • సామ బియ్యం : 1 కప్పు
  • మినపప్పు : 1 కప్పు
  • కొబ్బరిపాలు :  2 కప్పులు
  • బెల్లం పొడి : 1 కప్పు
  • యాలకుల పొడి : 1 టీస్పూన్
  •  కొబ్బరి తురుము : అర కప్పు 
  • నూనె : వేగించడానికి సరిపడా
  • జీడిపప్పు బాదం:  గార్నిష్ కోసం


తయారీ విధానం: సామబియ్యం, మినపప్పు నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా.. గట్టిగా రుబ్బాలి. పాన్​ లో  నూనె వేడి చేసి సామపిండిని చిన్న చిన్న ఉండలుగా నూనెలో దోరగా వేగించాలి. తర్వాత చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని అందులో బెల్లంపొడి, యాలకుల పొడి కలిపి ఒక గిన్నెలోకి వడకట్టాలి. తర్వాత దోరగా వేగించిన ఉండలను మరిగే నీళ్లలో నాలుగు నిమిషాలు ఉడికించి, వడకట్టిన కొబ్బరి పాలలో వేసి పైన కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్​ చల్లితే రుచికరమైన సామ పాలతాలికలు రెడీ.. తింటే రుచితో పాటు శరీరం కూడా ధృడంగా ఉంటుంది. . .

సామలతో పొంగలి తయారీకి కావలసినవి

 

  • సామలు: 1 కప్పు
  • పెసరపప్పు: అర కప్పు
  • బెల్లం: 1 కప్పు
  • యాలకుల పొడి: పావు టీస్పూన్ 
  • నెయ్యి :  3 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు: 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చ కర్పూరం : చిటికెడు 

తయారీ విధానం: ముందుగా సామలు, పెసరపప్పు ఎర్రగా వేగించాలి. ఇప్పుడు వాటిని ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకుని మూడు కప్పుల నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మీడియం మంటపైన మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. ప్రషర్ మొత్తం పోయిన తర్వాత సామలు, పెసరపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే పాన్ వేడి చేసి కప్పు నీళ్లతో బెల్లం కరిగించాలి. అందులో యాలకుల పొడి పచ్చకర్పూరం కూడా వేయాలి. తర్వాత ముందు చేసుకున్న సామమిశ్రమాన్ని .. బెల్లం పాకంలో బాగా కలపాలి. చివరిగా నెయ్యిలో వేగించిన జీడిపప్పును కలిసి పాన్ దించేయాలి.

సామ వెజ్ కిచిడి తయారీకి కావలసినవి

  • సామల బియ్యం : ఒక గ్లాసు
  • ఉల్లిపాయ : ఒకటి 
  • టొమాటో : ఒకటి
  • క్యారెట్:  ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్టు: 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి: 4
  • జీలకర : 1 టీ స్పూన్
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు: 1టేబుల్ స్పూన్
  • ఉప్పు: తగినంత
  • పసుపు:  అర టీ స్పూన్

తయారీ విధానం : సామల బియ్యాన్ని కడిగి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి. ఉల్లిపాయ, టొమాటాలను, క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటోలను చిన్న ముక్కలుగా తరగాలి. ప్రెషర్ పాన్​ లో నూనె వేడి చేసే జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి.  తర్వాత టోమాటో ముక్కలు వేసి సన్న మంట మీద వేగించాలి. అవి మెత్తబడిన తర్వాత క్యారెట్​, పసుపు వేసి బాగా కలిపి మూతపెట్టి రెండు నిమిషాల సేపు ఉంచాలి.. మగ్గిన తర్వాత సామబియ్యం నీటితో పాటు ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి, తర్వాత స్టౌ అపేయాలి. దీనిని బాణలిలో కూడా వండొచ్చు. అపుడు నీళ్లు కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ కిచిడితో అవకాయ , పచ్చళ్లు, పుదీన, వేరు శెనగపప్పు చట్నీలు బాగుంటాయి.

►ALSO READ | ధనుర్మాసం : నాలుగో పాశురం.. స్వామి మహిమను చెప్పిన గోదాదేవి..!

సామలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! 

సామల దిగుబడిలో మన దేశానిదే అగ్రస్థానం. తూర్పు, దక్షిణ భారత దేశంలో ప్రజలు ఇప్పటికీ వీటిని వినియోగిస్తున్నారు.
 సామలను నేరుగా ఉడికించుకుని అన్నంలా వండుకోవడంతో పాటు జావ, రొట్టెలు చేసుకోవచ్చు.
తక్షణ శక్తినిస్తాయి. తేలికగా అరుగుతాయి. సామలతో జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. స్థూలకాయం, టైప్–2  -డయాబెటిస్ సమస్యల కుదూరంగా ఉండొచ్చు.

 

  •  సామలతో రక్తహీనత దరిచేరదు. గుండెజబ్బులు, ఉబ్బసం లాంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.
  •  ఉదర సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. అలాగే రుతుక్రమం సరిగ్గా రావడానికి సామలు బాగా ఉపయోగపడతాయి.
  •  మలబద్ధకాన్ని అరికడతాయి. సీలియాక్​ జబ్బుకు అనువైన ఆహారం సాములు. ఇందులో శక్తి, కొవ్వు, ఐరన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ సమస్యలకు సామ బియ్యం మంచిది.
  •  సామల్లో విటమిన్ బీ1, బీ2, బీ3, బీ5. బీ 6. వంటి విటమిన్లు, ఫాస్పరస్, జింక్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. 
  • పైత్యం ఎక్కువ కావడం వల్ల వచ్చే వ్యాధులకు సాన ఔషధంగా పని చేస్తుంది. భోజనం చేసిన తర్వాత గుండెల్లో మంట, పుల్లని తేన్పులు రావటం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తే సామలతో నివారించవచ్చు. 

వందగ్రాముల సామల్లో ఉండే పదార్దాలు ఇవే

 

  •  7.7 గ్రాముల ప్రొటీన్లు
  • 5.2 గ్రాముల కొవ్వు పదార్థాలు 
  • 7.6 గ్రాముల పీచు
  • 1.5 గ్రాముల మీ నరల్స్
  •  9.3 మిల్లీ గ్రాముల ఐరన్ 
  • 17 మిల్లీ గ్రాముల క్యాల్షియం
  • 207 కేలరీల శక్తి ఉంటుంది.
–వెలుగు,లైఫ్​–