హైదరాబాద్, వెలుగు: రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకొస్తే.. కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందాకు వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూసమస్యలు పరిష్కరించాల్సిందిపోయి.. పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరతీసినట్టు సర్కార్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతిలో రికార్డుల మార్పుచేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అన్నీ సక్రమంగా ఉన్నా ఫైల్‌పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని.. లేదంటే ఏదో ఒక సాకుతో ఫైల్‌ను పక్కన పడేస్తున్నారని ఫిర్యాదుల్లో బాధిత రైతులు పేర్కొంటున్నారు. తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనికరించని అధికారులు.. మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే, గంటల వ్యవధిలో పని పూర్తి చేస్తున్నట్టు సీఎంవోకు పలువురు రైతులు కంప్లయింట్ చేశారు.
సంతకానికో రేటు..
భూభారతి చట్టం అమల్లో భాగంగా అధికారుల స్థాయిని బట్టి ప్రభుత్వం స్పష్టమైన అధికారాలను కట్టబెట్టింది. సాధారణ మ్యుటేషన్లు (రిజిస్ట్రేషన్ వెంటనే), వారసత్వ బదలాయింపులను తహసీల్దార్లకు అప్పగించగా.. అప్పీళ్లు, సివిల్ కోర్టు డిక్రీల అమలును ఆర్డీవోలకు అప్పగించింది. సంక్లిష్టమైన భూములకు సంబంధించిన అధికారాలను మాత్రం అడిషనల్ కలెక్టర్ల పరిధిలోనే ఉంచింది. ముఖ్యంగా నిషేధిత జాబితా (22-ఏ) నుంచి భూముల తొలగింపు, ప్రభుత్వ భూమిగా పొరపాటున నమోదైన సర్వే నంబర్ల సవరణ, డేటా కరెక్షన్ మాడ్యూల్స్, విస్తీర్ణంలో తేడాల సవరణ, ఆర్డీవో ఉత్తర్వులపై వచ్చే అప్పీళ్ల వంటి కీలక అధికారాలు అడిషనల్ కలెక్టర్లకే ఇచ్చింది. ఈ అధికారాలనే అడ్డంపెట్టుకుని అడిషనల్ కలెక్టర్లు దందాకు తెరదీశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన క్లిష్టమైన సమస్యలన్నీ వీరి లాగిన్‌లోనే ఉండటంతో, ఒక్కో సంతకానికి రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి అదనంగా భూభారతి పోర్టల్‌లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ల పరిస్థితి అట్లనే ఉందని తెలిసింది.
ఆ జిల్లాల నుంచే ఎక్కువ కంప్లయింట్స్..
ప్రధానంగా హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల నుంచి కంప్లయింట్ఎక్కువగా ఉన్నట్టు సీఎంవో అధికారులు గుర్తించారు. ఇక్కడ గజం భూమి ధర లక్షల్లో, ఎకరం కోట్లలో ఉండటంతో.. సమస్య పరిష్కారానికి అడిషనల్ కలెక్టర్ల స్థాయి వరకు అధికారులు రూ.లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని హై-వాల్యూ జోన్ల నుంచి భూభారతి పోర్టల్‌లోకి వచ్చిన దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జిల్లాల నుంచే సోషల్ మీడియాలో, ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. తాము నేరుగా వెళ్లి కలుద్దామన్నా అవకాశం ఇవ్వని అధికారులు.. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వచ్చే డీల్స్ మాత్రం చక్కబెడుతున్నారని, తమ భూమి తమకు దక్కాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తున్నదని బాధితులు సీఎంవోకు కంప్లయింట్చేస్తున్నారు.
