రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన రీసెంట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ అఫీషియల్ అప్డేట్ వచ్చింది. క్రిస్మస్ స్పెషల్గా డిసెంబర్ 25, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుందని సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించింది.
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో నెలరోజుల లోపే ఓటీటీ దర్శనం ఇవ్వనుంది ఈ ఆంధ్రా కింగ్ తాలూకా. అయితే, ఈ ఓటీటీ విడుదల ద్వారా ప్రేక్షాదరణకు అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ఇందులోని కథనం చాలా గొప్పగా ఉంటుంది. అది థియేటర్ ఆడియన్స్ కు పెద్దగా ఎక్కపోయినా.. ఓటీటీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సహజంగా తమ ఫేవరేట్ స్టార్‌ను వెతుక్కుంటూ అభిమానులు వెళ్తుంటారు. కానీ స్టార్ హీరోనే ఎలా ఉంటాడో తెలియని ఓ అభిమానిని వెతుక్కుంటూ వెళ్లడం, 'జీవితంలో కింద పడితే' ఎలా తిరిగి నిలబడొచ్చు అనే ధైర్యాన్ని అతని నుంచి నేర్చుకోవడం అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీలైన్. అలాగే ఓ సాధారణ అభిమాని తన అభిమాన హీరోకి సమస్య వస్తే సాయం చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? అందుకు అతని ప్రేమ ఎలా కారణమైంది? అనేది ఈ ఇందులోని మరో ఉపకథ.
దర్శకుడు మహేష్ ఎంచుకున్న స్టోరీ లైన్ అద్భుతంగా ఉంది. అయితే ప్రధాన కథ కంటే ఉపకథకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. సినిమా ప్రారంభంలోనే హీరో సమస్య, అందుకు అభిమాని పరిష్కరించడాన్ని చూపించిన దర్శకుడు.. ఆ తర్వాత మొత్తం హీరో లవ్ స్టోరీ చుట్టూ కథ నడిపించాడు.
Ippati dhaaka star biopics ey chusam, ippudu its time for a fan biopic 😎🌟 pic.twitter.com/XsbP0dGrs6
— Netflix India South (@Netflix_INSouth) December 20, 2025
కథగా...
సాగర్ (రామ్) దారి తీరు లేని ఓ లంక గ్రామం నుంచి వచ్చి టౌన్‌లో పాలిటెక్నిక్ చదివే సాదాసీదా కుర్రాడు. కానీ స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కు వీరాభిమాని. లోకల్‌గా ఫ్యాన్స్ ప్రెసిడెంట్. తన ఫేవరేట్ హీరోను ఎవరేమన్నా గొడవపడతాడు. షో క్యాన్సిల్ చేశారంటే థియేటర్ అద్దాలు పగలకొడతాడు. అదే థియేటర్‌లో టికెట్లు కొని అభిమానులకు పంచిపెడతాడు. పక్కనోళ్లు అది పిచ్చి అంటుంటే తను మాత్రం అభిమానం అంటాడు.
అలాంటి ఓ సాధారణ అభిమాని.. థియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీ శర్మ) కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) ఇష్టపడతాడు. ఏ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ తన థియేటర్‌లో టికెట్ల కోసం పడిగాపులు గాచే ఓ అభిమానికి తన కూతురును ఎలా ఇస్తానంటూ ఎద్దేవ చేస్తాడు పురుషోత్తం.
తన ప్రేమను గెలుచుకోవడం కోసం కరెంట్, రోడ్డు సహా కనీస అవసరాలు లేని తన ఊర్లో AC థియేటర్ కట్టి తన అభిమాన హీరో 100వ సినిమాతో ఓపెనింగ్ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అలా తాను విసిరిన ఛాలెంజింగ్ కోసం సాగర్ ఏం చేశాడు అనేది మిగతా కథ.
