భూభారతి చట్టం అమల్లో భాగంగా అధికారుల స్థాయిని బట్టి ప్రభుత్వం స్పష్టమైన అధికారాలను కట్టబెట్టింది. సాధారణ మ్యుటేషన్లు (రిజిస్ట్రేషన్ వెంటనే), వారసత్వ బదలాయింపులను తహసీల్దార్లకు అప్పగించగా.. అప్పీళ్లు, సివిల్ కోర్టు డిక్రీల అమలును ఆర్డీవోలకు అప్పగించింది. సంక్లిష్టమైన భూములకు సంబంధించిన అధికారాలను మాత్రం అడిషనల్ కలెక్టర్ల పరిధిలోనే ఉంచింది. ముఖ్యంగా నిషేధిత జాబితా (22-ఏ) నుంచి భూముల తొలగింపు, ప్రభుత్వ భూమిగా పొరపాటున నమోదైన సర్వే నంబర్ల సవరణ, డేటా కరెక్షన్ మాడ్యూల్స్, విస్తీర్ణంలో తేడాల సవరణ, ఆర్డీవో ఉత్తర్వులపై వచ్చే అప్పీళ్ల వంటి కీలక అధికారాలు అడిషనల్ కలెక్టర్లకే ఇచ్చింది. ఈ అధికారాలనే అడ్డంపెట్టుకుని అడిషనల్ కలెక్టర్లు దందాకు తెరదీశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన క్లిష్టమైన సమస్యలన్నీ వీరి లాగిన్‌లోనే ఉండటంతో, ఒక్కో సంతకానికి రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి అదనంగా భూభారతి పోర్టల్‌లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ల పరిస్థితి అట్లనే ఉందని తెలిసింది.
అన్నీ కరెక్టుగా ఉన్నా..
భూరికార్డుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లినా వాటిని సవరించుకునేందుకు రైతులు నానాతంటాలు పడాల్సి వస్తున్నది. నిజానికి రైతుల వద్ద అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, ఫైలు ఆమోదం పొందడం లేదు. “అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ సార్‌ను కలవాల్సిందే” అంటూ కింది స్థాయి సిబ్బంది నుంచి సంకేతాలు వెళ్తున్నాయి. అడిగినంత ఇచ్చుకోలేని సామాన్య రైతుల దరఖాస్తులను ఏదో ఒక సాకు చూపి పక్కన పడేస్తున్నారు. లేదా ‘విచారణలో ఉంది’ అనే కారణంతో డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రిపోర్ట్ రాసి కరెక్షన్చేయాలని, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రికమండ్చేసిన భూముల విషయంలోనూ అదనపు కలెక్టర్లు రిమార్క్‌లు రాసి పక్కన పెడుతున్నారు. ఇక భూభారతి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న కొన్ని సాంకేతిక నిబంధనలను కూడా అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. డాక్యుమెంట్లు సరిగా లేవని రిజెక్ట్ చేయడం, లేదా ‘సివిల్ తగాదా’ అని ముద్ర వేసి పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. వాస్తవానికి రైతుల వద్ద పక్కా ఆధారాలు, లింక్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఎంతో కొంత ఇస్తే మాత్రం, నిబంధనలను సైతం పక్కన పెట్టి రికార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వానికి చాలా కంప్లయింట్లు వస్తున్నాయి.
