పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక మలుపు. పీటీఐ.. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు. ఆయన భార్య బుష్రా బీబీకి సైతం 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు.
తోషాఖాన్ 2 అవినీతి కేసులో విచారణ తర్వాత ఈ తీర్పు ఇచ్చారు జడ్జి. 2021లో సౌదీ రాజు అధికారిక పర్యటనలో భాగంగా.. ఇమ్రాన్ ఖాన్ కు బహుమతిగా ఆభరణాల సెట్ ఇచ్చారు. దాన్ని ఆ తర్వాత అతను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చూపించారు. ఈ కేసును తోషాఖానా 2గా పిలుస్తున్నారు. ఈ కేసులోనే ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. జైలులోనే జరిగిన విచారణ తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి షారుఖ్ అర్జుమంద్.. ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీలకు 17 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని సెక్షన్ 409 కింద.. అవినీతి, విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్రలో భాగంగా ఈ శిక్ష విధించారు.
17 ఏళ్ల జైలు శిక్షతో ఒక్కొక్కరికీ 16.4 మిలియన్ల జరిమానా విధించింది కోర్టు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని ఇమ్రాన్ ఖాన్ తరపు లాయర్లు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ కు జైలు శిక్ష తర్వాత పాకిస్తాన్ దేశంలో టెన్షన్ నెలకొంది. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు.
