
మెక్సికో సిటీ నార్త్ వెస్ట్ క్రాసింగ్లో సోమవారం ఉదయం ఒక గూడ్స్ రైలు డబుల్ డెక్కర్ బస్సును ఢీకొట్టడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. మెక్సికోకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాకోముల్కో నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెక్సికోలోని కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ ఈ రైలు ప్రమాదాన్ని ధృవీకరించింది అలాగే బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. కెనడాకు చెందిన కాల్గరీ కంపెనీ స్టాఫ్ బస్సులో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో భారీ ట్రాఫిక్‌లో ఉన్న బస్సు నెమ్మదిగా రైలు పట్టాల మీద నుండి వెళ్తుండగా, వేగంగా వస్తున్న రైలు ఒక్కసారిగా బస్సును ఢీకొట్టింది. దింతో రైలు వేగానికి బస్సు ముక్కలైంది.
క్రాసింగ్ గేట్లు లేదా ఇతర సిగ్నల్స్ లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇది నిజంగా దురదృష్టకరం, రైలు వెళ్లే సమయంలో బస్సు పట్టాలు దాటకుండా ఉండాల్సిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే 2020లో రైలు ప్రమాదంలో సుమారు 602 మంది మరణించగా, గత ఏడాది 800 మంది చనిపోయారు. గత నెల గ్వానాజువాటో రాష్ట్రంలో రైలు ఢీకొట్టడంతో ఆరుగురు మరణించగా, 2019లో కూడా ట్రాక్ దాటుతున్న బస్సును ఓ గూడ్స్ రైలు ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు.