
- వార్షికంగా 24.5శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల్లో లోన్లు ఇచ్చే మైక్రో ఫైనాన్స్ కంపెనీల వ్యాపారం బాగా పెరుగుతోంది. మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ (ఎంఎఫ్ఐఎన్) డేటా ప్రకారం 2023-–24లో మైక్రోఫైనాన్స్ కంపెనీ లోన్ పోర్ట్‌ఫోలియో సంవత్సరానికి 24.5 శాతం పెరిగి రూ. 4,33,697 కోట్లకు ఎగిసింది. మార్చి 2023 చివరి నాటికి స్థూల లోన్ల పోర్ట్‌ఫోలియో (జీఎల్పీ) రూ. 3,48,339 కోట్లు ఉంది. వార్షిక వృద్ధి 2023 ఆర్థిక సంవత్సరంలో 22.03 శాతంగా ఉంది. మొత్తం లోన్ ఖాతాల సంఖ్య ఏడాదికి 13 కోట్ల డాలర్ల నుంచి మార్చి 2024 చివరి నాటికి 14.9 కోట్లకు పెరిగింది.
మైక్రోఫైనాన్స్ బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ, ఎఫ్ఎఫ్ఐలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) మైక్రోఫైనాన్స్ లోన్ల పోర్ట్‌ఫోలియోతో పనిచేసే ఫైనాన్స్ కంపెనీలు ఇలాంటి లోన్లను ఇస్తాయి. ఎంఎఫ్ఐఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలోక్ మిశ్రా మాట్లాడుతూ “2024 ఆర్థిక సంవత్సరంలోనూ మైక్రోఫైనాన్స్ రంగం స్థిరమైన వృద్ధి కొనసాగింది. గత ఏడాది (2023 ఆర్థిక సంవత్సరం) పోర్ట్‌ఫోలియోలో 4.5 శాతం మందగమన వృద్ధిని నమోదు చేసిన బ్యాంకులు ఈ ఏడాది 20.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎన్‌బీఎఫ్‌సీ, ఎఫ్ఎఫ్ఐలు గత ఏడాది 37.7 శాతంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో తమ పోర్ట్‌ఫోలియోలో 23.6 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేశాయి”అని ఆయన వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీ, -
ఎంఎఫ్‌ఐలు రూ. 1,70,903 కోట్ల లోన్ మొత్తాలతో అతి పెద్ద మైక్రో-క్రెడిట్ ప్రొవైడర్‌గా ఎదిగాయి. మొత్తం పరిశ్రమ పోర్ట్‌ఫోలియోలో వీటికి 39.4 శాతం వాటా ఉంది.
బ్యాంకులకూ భారీ వాటా
రూ. 1,44,022 కోట్ల విలువైన లోన్లతో మైక్రో-క్రెడిట్‌లో పోర్ట్‌ఫోలియోలో బ్యాంకులు రెండవ అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఇది మొత్తం మైక్రోక్రెడిట్లో 33.2 శాతం మొత్తానికి సమానం. ఎస్ఎఫ్బీలు మొత్తం 17.1 శాతం వాటాతో రూ. 74,278 కోట్ల విలువైన మైక్రోఫైనాన్స్ లోన్లు ఇచ్చాయి. ఎన్‌బీఎఫ్‌సీల వాటా 9.3 శాతం, ఇతర ఎంఎఫ్‌ఐలు 0.9 శాతం వాటా కలిగి ఉన్నారు. జీఎల్పీ ప్రకారం మొత్తం పోర్ట్‌ఫోలియోలో తూర్పు, ఈశాన్య, దక్షిణ వాటా 62 శాతం ఉంది. పోర్ట్‌ఫోలియో పరంగా బీహార్ అతిపెద్ద రాష్ట్రం కాగా, తర్వాత తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.