
- మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన
బషీర్బాగ్, వెలుగు: లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు.. కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ఐదు నెలలుగా జీతాలు, పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ రమ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల బిల్లులను యుకుబేర్ సంస్థ నుంచి కాకుండా , ప్రభుత్వమే నేరుగా చెల్లించాలన్నారు. వంటకు అవసరమయ్యే గ్యాస్ ను ఉచితంగా ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మెనూకు అనుగుణంగా బడ్జెట్ ను పెంచాలన్నారు. ఈ డిమాండ్ లతో కమిషనర్ కార్యాలయ గేటు నుంచి రోడ్డుపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగి కొద్ది సపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.