నీళ్లపై హీట్!.. ఇయ్యాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కృష్ణా, గోదావరి జలాల అంశమే ప్రధాన ఎజెండా

నీళ్లపై హీట్!.. ఇయ్యాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కృష్ణా, గోదావరి జలాల అంశమే ప్రధాన ఎజెండా

 

  • పదేండ్ల బీఆర్​ఎస్  పాలనలోని వైఫల్యాలను ఎండగట్టనున్న కాంగ్రెస్
  • రెండేండ్ల కాంగ్రెస్​ పాలనపై ప్రశ్నించనున్న బీఆర్​ఎస్ప్ర
  • జా సమస్యలపై నిలదీయనున్న బీజేపీ
  • ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం
  • తొలిరోజు మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, 
  • కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానాలు
  • ఏడు ఆర్డినెన్స్​లకు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • జనవరి 2, 3 తేదీల్లో కృష్ణా, గోదావరి బేసిన్లపై సభలో చర్చ!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కృష్ణా, గోదావరి నీళ్ల అంశమే ఈసారి సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. కృష్ణా, గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం అధికార, ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం సహా నీటి సమస్యకు పదేండ్ల బీఆర్ఎస్ పాలన పాపమేనని అధికార పార్టీ కాంగ్రెస్​ ఎండగట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది. 

ప్రాజెక్టులను కేఆర్‌‌ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఇది రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగేందుకు ప్లాన్​ చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం కూడా ప్రజా సమస్యలు, గ్యారంటీల అమలు, పాతబస్తీ అభివృద్ధిలాంటి అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. 

మొదటిరోజు ఇలా.. 

సోమవారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సభలో సంతాప తీర్మానాలు ఉంటాయి. ఇటీవల మరణించిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేయనుంది. మరోవైపు పాలనపరమైన అంశాల్లో భాగంగా గతంలో జారీ చేసిన ఏడు ఆర్డినెన్స్‌‌ల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సంతాప తీర్మానాల్లో దామోదర్​రెడ్డి, లక్ష్మారెడ్డి సేవలనుకొనియాడుతూ సీఎం, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతారు. అనంతరం తొలిరోజు సభ వాయిదా పడే అవకాశముంది. 

సీఎం  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష బీఆర్​ఎస్​ను ఇరుకున పెట్టేందుకు అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నది.  కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అన్నీ గత బీఆర్ఎస్  ప్రభుత్వ వైఫల్యాలేనని ఎండగట్టేలా సభలో  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అంశంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఇటీవల సవాల్ విసరడం రాజకీయ వేడిని రగిల్చింది. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  పార్టీ నీటి వాటాలను తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపించడమే కాకుండా, అందుకు సంబంధించి అనేక సందర్భాల్లో కేసీఆర్​ మాట్లాడిన వీడియోలు, మినిట్స్​ పేపర్లు, కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ అపెక్స్​ కౌన్సిల్​లో చేసిన సంతకాలు, ఏపీ తరలించుకుపోయిన నీళ్ల వివరాలను చూపించాలని చూస్తున్నది. 

నీళ్లపైనే ప్రశ్నించేందుకు బీఆర్​ఎస్​ రెడీ

చాలా కాలం తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది. ప్రాజెక్టులను కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ (కేఆర్​ఎంబీ )కి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వాదిస్తున్నది. పాలమూరు-– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి వాటాను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారని, దీనిపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ నిలదీసేందుకు వ్యూహరచన చేసింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పింఛన్లు, ఆరు గ్యారంటీలు సహా పలు అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అసలు ఉన్న సిటీకే దిక్కులేదంటూ ఎటాక్​ చేయాలని బీఆర్ఎస్​ చూస్తున్నది. ప్రజా దర్బార్‌‌‌‌‌‌‌‌పై శ్వేతపత్రానికి డిమాండ్ చేయాలని నిర్ణయించింది.

ఆర్డినెన్స్​లు ఇవే..!

తొలిరోజు సభ ప్రారంభం కాగానే  7 కీలక ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌లను సభ ముందు ఉంచనున్నారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ జీఎస్టీ సవరణ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల క్రమబద్ధీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. అలాగే సమగ్ర శిక్షా, పీఎం శ్రీ పథకాల ఆడిట్ నివేదికలను కూడా సీఎం సభకు సమర్పించనున్నారు.

సమావేశాలు ఎన్నిరోజులనే దానిపై బీఏసీలో నిర్ణయం

తొలిరోజు సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  చాంబర్‌‌‌‌‌‌‌‌లో కీలకమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది. ఇయర్​ ఎండ్​ కావడంతో ఈ నెల 30, 31, వచ్చే జనవరి 1 తేదీలు వదిలేసి ఆ తర్వాత  2,3 తేదీల్లో వరసగా కృష్ణా, గోదావరి బేసిన్లపై సభలో చర్చించేలా ప్రభుత్వం సిద్ధమైంది. బీఏసీ సమావేశంపై అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖలు పంపారు. ఈ బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్​, మంత్రులతో పాటు ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు కూడా ఆహ్వానం పంపారు.

బీఆర్ఎస్ తరఫున హరీశ్​రావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. బీఏసీ సమావేశంలోనే సభను ఎన్ని రోజులు నడపాలి, కృష్ణా జలాలపై చర్చ ఎప్పుడు చేపట్టాలి, ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌ల స్థానంలో బిల్లులపై చర్చించి ఎప్పుడు ఆమోదించాలి అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.  

సమావేశాలపై చైర్మన్​, స్పీకర్​ రివ్యూ

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌‌‌‌‌‌‌‌లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి ఆర్.తిరుపతి ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీపీ విజయ్​కుమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు వి.సి.సజ్జనార్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ తదితరులు హాజరయ్యారు. 

శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులు కచ్చితంగా అందుబాటులో ఉండాలని, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని మండలి చైర్మన్, స్పీకర్ ఆదేశించారు. 'చలో అసెంబ్లీ' వంటి కార్యక్రమాలు, ధర్నాలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.