- నాన్ జుడీషియల్ బాండ్లకు డబ్బు కట్టేందుకూ ఇబ్బందే
- 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి
- మున్సిపాలిటీ, రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ జనాల చక్కర్లు
గద్వాల, వెలుగు: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, మున్సిపాలిటీల్లో సర్వర్లు సతాయిస్తుండడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. 20 రోజులుగా డెత్, బర్త్ సర్టిఫికెట్లతో పాటు ఇతర పత్రాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈసీ, సీసీ, నాన్ జుడీషియల్ బాండ్ల కోసం జనాలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 20 రోజులుగా సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో? ఎప్పుడు మొరాయిస్తాయో? తెలియని పరిస్థితి నెలకొంది.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే తప్పనిసరిగా ఈసీ అవసరం ఉంటుండగా, అది రాకపోవడంతో చాలా చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. నాన్ జుడీషియల్ బాండ్ల కోసం పేమెంట్ కట్ అవుతున్నా రసీదు రాకపోవడం, కట్ అయిన డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు..
మున్సిపాలిటీలో డెత్, బర్త్ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. 20 రోజుల నుంచి సర్వర్లు సతాయించడంతో డెత్, బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మందికి సర్టిఫికెట్లు సకాలంలో అందడం లేదు. ప్రతి రోజు గద్వాల మున్సిపాలిటీకి పదుల సంఖ్యలో జనాలు వస్తున్నప్పటికీ, సర్వర్ ప్రాబ్లం ఉంది.. ఇప్పుడే ఇవ్వలేమని అక్కడి సిబ్బంది సమాధానం చెబుతున్నారు.
ఇలా గద్వాల జిల్లాలోనే వందల సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ కాలేదు. విషయం తెలియని వారు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారని మున్సిపల్ సిబ్బందితో వాదనకు దిగుతున్నారు.
20 రోజుల నుంచి ఇదే పరిస్థితి..
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈసీ, సీసీ, నాన్ జుడీషియల్ బాండ్ల కోసం వెళ్తే, ఆన్ లైన్ లో పేమెంట్ కట్ అవుతున్నప్పటికీ సర్టిఫికెట్లు రావడం లేదని వాపోతున్నారు. ఈసీ కోసం దరఖాస్తు చేసుకోవాలని వెళ్తే ఒకసారి స్లోగా పని చేయడం, మరోసారి నో డేటా అంటూ సమాచారం రావడంతో తిప్పలు పడుతున్నారు.
మొత్తానికే సర్వర్లు పని చేయకుండా ఉంటే బెటర్ గా ఉండేదని, సర్వర్లు సతాయిస్తుండడంతో ఆన్ లైన్ లో డబ్బులు కట్ అవుతున్నాయని వాపోతున్నారు. ఈసీ, సీసీ, నాన్ జుడీషియల్ బాండ్లకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న చాలా మందికి ఇలాగే జరగడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
సమస్య పరిష్కారం అవుతుంది..
సర్వర్లు సతాయిస్తున్న మాట వాస్తవమే. ఈ సమస్య రాష్ట్రమంతా ఉంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.
-జానకీరాం సాగర్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
