కాంగ్రెస్ విజయం కోసం కలిసి పనిచేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కాంగ్రెస్ విజయం కోసం కలిసి పనిచేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నాయకులంతా ఐక్యతతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ ఎంపీ రఘువీర్‌‌ రెడ్డి మాట్లాడుతూ..  సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మున్సిపాలిటీ పరిధిలో 54 వేల మెజార్టీ వచ్చిందన్నారు.  ఈ ఎన్నికల్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

 గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ 24 స్థానాలు గెలిచిందన్నారు. ఈ సారి 48 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.  రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. ఐదు లక్షల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాలు, పేదలకు రేషన్ కార్డులు అందిస్తోందని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 114  గ్రామ పంచాయతీల్లో 74 గెలిచి కాంగ్రెస్ సత్తా చాటిందన్నారు.

 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడ్డాయని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ నేతలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, అనుముల రవి, తండు శ్రీనివాస్, అంజద్ అలీ, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.