మన రోడ్లు దేశానికి రోల్‌ మోడల్ కావాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మన రోడ్లు దేశానికి రోల్‌ మోడల్ కావాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • హ్యామ్​ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హ్యామ్ విధానంలో నిర్మించబోయే రోడ్లు దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎర్ర మంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీలు, సీఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా నిధులతో హ్యామ్ విధానంలో చేపట్టబోయే రోడ్లు, సీఆర్‌‌ఎఫ్, టిమ్స్ హాస్పిటల్స్ తదితర నిర్మాణాల పురోగతి అడిగి తెలుసుకున్నారు. 

గురువారం జరిగే కేబినెట్‌లో హ్యామ్ రోడ్లపై చర్చించాల్సిన అంశాలను ఇంజినీర్ల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హ్యామ్ విధానంలో రాష్ట్రంలో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. రోడ్ల నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని మంత్రి తెలిపారు. 

హ్యామ్ రోడ్లపై నేటి కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పేర్కొన్నారు.