
- ఇప్పటివరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లపై వేటు
- లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైనా కేసులు
- కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ
- వాస్తవమేనని తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు
- లంచం అడిగితే 1800 599 5991కు ఫిర్యాదు చేయండి: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కారు లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లుల చెల్లింపు దాకా పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండ్‌చేసే సిబ్బంది, అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా బేస్ మెంట్, గోడలు, స్లాబ్ లెవల్లో బిల్లుల కోసం ఫొటోలు తీయడం, అప్ లోడ్ చేయడానికి పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు స్వీకరించేందుకే హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ లో ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటుచేసి, టోల్‌ఫ్రీ నంబర్(1800 599 5991)ను అందుబాటులోకి తెచ్చింది. దీనిపై ప్రచారం చేయడంతో లబ్ధిదారులే నేరుగా ఫోన్ చేసి అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నెల 11న అధికారులు కాల్ సెంటర్ ను ప్రారంభించగా, నిత్యం వందల కాల్స్ వస్తున్నాయి. అందులో లంచాలపై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేకంగా విచారణ జరిపి వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10 మంది వరకు పంచాయతీ కార్యదర్శులను, హౌసింగ్ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరికొంత మందిపై విచారణ జరుపుతున్నారు.
లంచం ఇస్తేనే ఫొటోలు అప్‌లోడ్ చేస్తామంటూ..
సంగారెడ్డి జిల్లా నిజాంపేట పరిధిలోని ఏదులతండాకు చెందిన ఇందిరమ్మ లబ్ధిదారు అంగోత్ తులసీబాయి.. తనను పంచాయతీ కార్యదర్శి రూ.10 వేలు లంచం అడిగారని కాల్ సెంటర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని, కానీ ఇంతవరకు ఫొటో తీసి పంపలేదని, ఇందుకోసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్చేశాడని పేర్కొంది. దీంతో తాము రూ.5 వేలు ఇచ్చామని, మిగిలిన రూ.5 వేలు ఇస్తేనే ఇంటి పునాదుల ఫొటోను అప్‌లోడ్ చేస్తామన్నాడని ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరపగా, కార్యదర్శి ఫోన్ పే ద్వారా రూ.5 వేలు తీసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో సెక్రటరీని సస్పెండ్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ను హౌసింగ్ మంత్రి పొంగులేటి ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం మాజిద్‌పూర్ కు చెందిన కల్లె సత్యాలు అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ పంచాయితీ కార్యదర్శి రాఘవేంద్ర రూ.20 వేలు లంచం అడిగారని ఫిర్యాదు చేసింది. ఇల్లు బేస్‌మెంట్ వరకు పూర్తయిందని, ఇప్పుడు గ్రామ పైప్‌లైన్‌కు అడ్డంగా ఉందని చెప్పి ఇంటి ఫొటో తీయకుండా వేధిస్తున్నారని ఆమె వాపోయారు. ఆయన తీరు వల్ల 2 నెలలుగా నరకం అనుభవిస్తున్నామని, తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని చెబితే.. అలాగే చేస్కోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని ఆమె తెలిపారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాండూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే ఇందిరమ్మ లబ్ధిదారు తాను నిర్మించుకుంటున్న ఇంటికి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అడ్డుపడుతూ డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన అధికారులు ఆయనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు పెట్టారు. ఆమె ఫిర్యాదు ప్రకారం .. భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చిక్కోండ్ర మల్లేశ్ రూ.25 వేలు డిమాండ్ చేశాడు. భయపడిన భీమమ్మ రూ.10 వేలను మల్లేశ్‌కు ఇచ్చింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు మల్లేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
లంచం అడిగితే ఫోన్ చేయండి
పేదల కోసం సర్కారు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో ఎలాంటి అవినీతి, అక్రమాలను సహించబోం. పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు ఎవరైనా లంచం అడిగితే కాల్ సెంటర్ నంబర్ 1800 599 5991కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు వచ్చిన గంటల్లోనే ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. కాల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులను నేను కూడా పరిశీలిస్తున్నా. డబ్బుల కోసం పేదలను వేధిస్తే ఫిర్యాదు చేసిన 24 గంటల్లో విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేస్తం. విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేస్తున్నాం. దీనిపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి