తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు అన్నారు.. ఫ్యూచర్ సిటీలో శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులను ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకమైన స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్ అవసరాలను, రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ఏర్పాటు కాబోతున్న స్కిల్ యూనివర్సిటీ.. విద్య, నైపుణ్యాభివృద్ధి , యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించడంలో దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ : ప్రతి గింజ వరకు కొంటాం.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం అందుబాటులోకి వస్తే.. నగర అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో సాగుతున్న అన్ని నిర్మాణ పనులను అత్యంత నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఈ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
