సమ్మెకు వెళ్లకుండా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం!

సమ్మెకు వెళ్లకుండా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం!
  • ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపైమంత్రి పొన్నం ఆరా
  • ఎండీ సజ్జనార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి
  • త్వరలో సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం

హైదరాబాద్, వెలుగు:ఈ నెల 7వ తేదీ నుంచి ఆర్టీసీలోని కొన్ని యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకొని సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా వాటిని ఎలా పరిష్కరించవచ్చో ఆరా తీశారు. 

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా యూనియన్లను ఆర్టీసీలోకి అనుమతించాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని, రిటైర్డ్ ఉద్యోగుల స్థానంలో అదే స్థాయిలో నియామకాలు జరగాలని, చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేస్తున్నారని.. ఇలాంటి వాటి పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే కార్మికులు సమ్మె పిలుపుకు దూరంగా ఉంటారని సజ్జనార్ మంత్రికి వివరించినట్లు సమాచారం. కార్మికుల ప్రధాన డిమాండ్ల  పరిష్కారం విషయంలో మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వారి డిమాండ్ల పరిష్కారం కోసం చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. 

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లడంతో ఆయన హైదరాబాద్ చేరుకున్న తరువాత శనివారం లేదా ఆదివారం మంత్రి పొన్నం సీఎంతో భేటీ అయి కార్మికుల డిమాండ్లను వివరించనున్నారు. ఆ తర్వాత సీఎం తీసుకునే నిర్ణయం మేరకు కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి సమ్మె  నిర్ణయాన్ని కార్మికులు ఉపసంహరించుకునేలా ప్రభుత్వం వారి డిమాండ్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది.