
- ఫైలుపై మంత్రి సీతక్క సంతకం
హైదరాబాద్, వెలుగు: ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఎంపీడీవోల బదిలీలకు లైన్ క్లియర్ అయ్యింది. గురువారం మంత్రి సీతక్క ఎంపీడీవోల బదిలీ ఫైల్‌పై సంతకం చేశారు. ఆ వెంటనే సీఎం అనుమతి కోసం ఫైల్ పంపించారు. రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, 2024 ఫిబ్రవరిలో దాదాపు 399 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగిసి దాదాపు 16 నెలలు గడుస్తున్నా.. బదీలల ఉత్తర్వులపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంపీడీవోలు ఆందోళన చెందారు.
మంత్రి సీతక్కను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేయగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఎంపీడీవోలను వారి నియోజకవర్గాలకు కాకుండా సొంత జిల్లాలోనే ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఒకవేళ గతంలో పనిచేస్తున్న మండలం ఎంపీడీవో సొంత నియోజకవర్గం కాకపోతే అదే మండలానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొందరు ఎంపీడీవోలు అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. తమవి ఎన్నికల బదిలీలు అయినందున ఎలాంటి కండీషన్ లేకుండా పాత స్థానాలకే పంపాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.