పోషణ మాసాన్ని సక్సెస్ చేయండి : మంత్రి సీతక్క

 పోషణ మాసాన్ని సక్సెస్ చేయండి : మంత్రి సీతక్క
  • ప్రజాప్రతినిధులకు మంత్రి సీతక్క లేఖలు
  • ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ.30 వేలు, జిల్లాకు రూ. 50 వేల నిధులు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నామని, దీన్ని విజయవంతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ  మేరకు ఆదివారం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఆమె లేఖలు పంపారు. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చురుకుగా పాల్గొనాలని, తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం మొద‌‌‌‌‌‌‌‌టి అడుగు అని, ప్రతి ఇంటిలో పోషణపై చైతన్యం కల్పించడమే ఈ మాసం ప్రధాన ఉద్దేశమని మంత్రి సీతక్క తెలిపారు.

 ‘‘ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ.30 వేలు, ప్రతి జిల్లాకు రూ.50 వేల నిధులను విడుదల చేశాం. ఈ నిధులను ఉపయోగించి గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులను సంబంధిత అధికారులు నిర్వహించాలి” అని ఆమె ఆదేశాలు జారీ చేశారు. పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజ‌‌‌‌‌‌‌‌ల్లో సక్రమమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తల స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌కారంతో ప్రతి ఇంటికీ పోషణ సందేశం తీసుకెళుతామ‌‌‌‌‌‌‌‌న్నారు. ‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదంతో గ్రామీణ స్థాయిలో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి, ఆత్మనిర్భరతను పెంచే కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. టెక్నాలజీ వినియోగంతో గ్రామస్థాయిలోనూ పోషణ డేటాను సేకరించి, వాటిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపడతామని తెలిపారు.