ఇప్ప పువ్వు లడ్డూలు తింటే.. గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు : మంత్రి సీతక్క

ఇప్ప పువ్వు లడ్డూలు తింటే.. గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు : మంత్రి సీతక్క

ఇప్పపువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇప్పపువ్వు లడ్డూలు తింటే ఎంతో బలమని చెప్పారు మంత్రి సీతక్క. రానున్న రోజుల్లో ఇప్పపువ్వుతో వంట నూనెను కూడా తయారు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. పూర్వ కాలంలో ఇప్పపువ్వు నూనెతోనే వంటలు చేసేవారని, దేవుడి దీపారాధనకు కూడా దాన్నే వాడేవారని గుర్తుచేశారు. ఇప్పపువ్వు నూనె తలకు పెట్టుకుంటే జుట్టు ఎంతో నల్లగా, బలంగా మారుతుందని.. తాను చిన్నప్పుడు ఈ నూనెనే వాడానని, అందుకే తన జుట్టు ఇప్పటికీ అంత నల్లగా ఉందంటూ మంత్రి సీతక్క నవ్వుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహదేవునిగుడెం గ్రామంలో అడవి బిడ్డల జీవన శైలిలో, వారి సంస్కృతిలో భాగమైన ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూ కేంద్రాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలతో మంత్రి సీతక్క కాసేపు ముచ్చటించారు. లడ్డూల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకుని, స్వయంగా ఆ లడ్డూలను రుచి చూశారు. టేస్ట్ చాలా బాగుందంటూ మహిళలను అభినందించారు. ఇప్పపువ్వు విశిష్టతను కొనియాడారు. 

నాడు సమ్మక్క-సారక్క తల్లులకు ఇప్పపువ్వును ప్రసాదంగా పెట్టి పూజలు చేసేవారని గుర్తుచేశారు.  ఇప్పపువ్వు, లడ్డూల తయారీని మరింత ప్రోత్సహించేందుకు డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.