హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలనలో కీలక మార్పులకు దారితీసే కోర్ అర్బన్ రీజియన్ (CURE) ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ యాక్ట్–2026 నేటి నుంచి అమల్లోకి రానుంది. అక్టోబర్ 2న గెజిట్ నోటిఫికేషన్ జారీతో చట్టం అమల్లోకి వస్తుంది
1955 నాటి GHMC చట్టానికి బదులుగా CURE Act కొత్త సమగ్ర పాలనా వ్యవస్థను తీసుకురానుంది. క్యూర్ పరిధిలోని GHMC, Cyberabad Municipal Corporation (CMC), Malkajgiri Municipal Corporation (MMC) లకు సమన్వయంతో కూడిన పాలనా విధానం ఏర్పడనుంది.
CURE యాక్ట్ అమల్లోకి రావడంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో పౌర పాలనకు సంబంధించి సమగ్ర విధానం ఏర్పడనుంది. భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సుల వంటి అంశాల్లో ఏకరీతి విధానాన్ని తీసుకురావడమే చట్టం ఉద్దేశాల్లో ఒకటి.విలీన ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న పాలనా, పన్నుల విధానాల్లోని తేడాలను తగ్గించేలా కొత్త వ్యవస్థను రూపొందించారు.
ప్రాపర్టీ ట్యాక్స్‌లో కీలక మార్పు
CURE Actలో ముఖ్యమైన మార్పుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ విధానం ఒకటి. ప్రస్తుతం ఉన్న Annual Rental Value (ARV) విధానానికి బదులుగా Capital Value System (CVS) ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించే విధానం తీసుకురానున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న ఆస్తులకు కొత్త విధానం 2027–28 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మించి ఇంకా పన్ను అంచనా వేయని ఆస్తులకు CVS విధానం వెంటనే వర్తించనుంది.కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత పన్ను పెరుగుదల ఒక్కసారిగా భారం కాకుండా ఏటా 10 శాతానికి మించకుండా పరిమితం చేసే నిబంధనను చట్టంలో పొందుపరిచారు.
నగరంలోని ఆస్తుల వివరాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రతి ప్రాపర్టీకి ప్రత్యేక Integrated Identity Code కేటాయించే విధానం ప్రతిపాదించారు. ఆస్తిపన్ను, నీటి బిల్లు, సీవరేజ్, శానిటేషన్ వంటి సేవలను సమగ్రంగా అనుసంధానించే విధానానికి చట్టం ప్రాధాన్యం ఇస్తోంది.అదే విధంగా సింగిల్ విండో డిజిటల్ పోర్టల్ ద్వారా పౌర సేవలను అందించే వ్యవస్థను కూడా తీసుకురానున్నారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, వరదలు, ఇతర విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి క్యూర్ యాక్ట్ వీలు కల్పిస్తోంది. పర్యావరణం, హెరిటేజ్, ఫుడ్ సేఫ్టీ వంటి అంశాల్లోనూ ప్రత్యేక సమన్వయ వ్యవస్థలకు చట్టం అవకాశం కల్పిస్తోంది.
క్యూర్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ఓపెన్ స్పేస్‌లు వంటి పబ్లిక్ ఆస్తుల పరిరక్షణకు HYDRA కీలక పాత్ర పోషించనుంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, చెరువులు-నాలాల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సంబంధించిన చర్యలకు కొత్త పాలనా వ్యవస్థలో మరింత స్పష్టమైన చట్టపరమైన ఆధారం కల్పించనున్నారు.
2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలో CURE
CURE పరిధి Outer Ring Road (ORR) లోపల సుమారు 2,053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని GHMC, CMC, MMC అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించారు.దీంతో హైదరాబాద్ విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయంతో కూడిన సమగ్ర పాలనకు కొత్త చట్టం పునాది వేయనుంది.
