
- మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
ములుగు/ తాడ్వాయి, వెలుగు: విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఇష్టంతో చదవాలని మంత్రి సీతక్క సూచించారు. విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. శుక్రవారం ములుగు కలెక్టరేట్లో జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియట్, పదో తరగతి చదువుతున్న విద్యార్థులలో ఉత్తమ ఫలితాలను సాధించిన వారికి ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర, అడిషనల్కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ తో కలిసి విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఫస్ట్, టెన్త్ రిజల్స్లో ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు.
రానున్న పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కోరారు. జిల్లాలోని తాడ్వాయి, జగ్గన్నపేట ఆశ్రమ జూనియర్ కళాశాలలో 22మంది లెక్చరర్స్ కు మంత్రి చొరవతో పెండింగ్ వేతనాలు వచ్చాయి. దాంతో వారు మంత్రిని సన్మానించారు. అనంతరం జిల్లాలోని ఆశ్రమ పాఠశాల హాస్టల్ లలో విద్యనభ్యసించి 541మార్కులు పొంది టాపర్లుగా నిలిచిన 12విద్యార్థులను మంత్రి శాలువాతో సన్మానించారు. ఐటీడీఏ పరిధిలో డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 9మంది గిరిజన యువతకు డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తిచేసి లైట్ మోటార్ వెహికల్ లెర్నింగ్ లైసెన్స్ అందజేశారు. తాడ్వాయి మండలం మేడారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థిని పూనెం అక్షర టెన్త్ఫలితాల్లో 543 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలవడంతో మంత్రి ఆమెను సన్మానించారు. కార్యక్రమాల్లో ఆర్డీవో వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం, డీడీ పోచం, ఎస్ వో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.