- విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి: శ్రీధర్ బాబు
- టీశాట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లు సక్సెస్ సాధించాలంటే టెక్నాలజీలో మంచి నైపుణ్యం సాధించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు టీశాట్ సాంకేతికతను ఉపయోగించుకుని భవిష్యత్‌కు గట్టి పునాదులు వేసుకోవాలన్నారు. సర్కారు స్కూళ్ల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ రాష్ట్ర స్థాయి వార్షిక పోటీల్లో విజేతలకు గురువారం టీశాట్ ఆఫీసులో బహుమతి ప్రదాన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. విజయం సాధించిన విద్యార్థులకు ప్రైజులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.
డిజిటల్ విద్యలో టీసాట్ నెట్వర్క్ అందిస్తున్న సాంకేతికతను ప్రభుత్వ పాఠశాలలు, మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ కలలను విద్యార్థులు నిజం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, టీచర్లకు టీశాట్ డిజిటల్ పాఠాలు చాలా ఉపయోగపడతాయన్నారు. మంత్రి శ్రీధర్ బాబు టీశాట్‌కు మద్దతునివ్వడం ద్వారా తెలంగాణ విద్యార్థులు, యువతకు పరోక్షంగా చేయూతనిస్తున్నారని ఆ సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
