విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

విలీన గ్రామాల్లో  మౌలిక వసతుల కల్పనకు కృషి
  • ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా పట్టిష్ట చర్యలు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • కేఎంసీ పరిధిలో పలు పనులకు శంకుస్థాపన 

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో విలీనమైన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో ఆయన పర్యటించారు. మున్సిపల్ నిధులు రూ.1.46కోట్లతో  నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేఎంసీలో విలీనమైన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం త్వరగా జరుగుతోందని, అందుకు అనుగుణంగా కొత్త రోడ్లు, డ్రైయిన్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

 6వ డివిజన్ పరిధిలో వేగంగా పూర్తి స్థాయిలో రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలో ఖాళీ స్థలాల యజమానులు బాధ్యత తీసుకొని వారి స్థలం నుంచి దుర్వాసన, దోమలు రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత  నిర్మించుకోవాలన్నారు. నగరంలో జరిగే నూతన నిర్మాణాలను ప్రారంభ దశలోనే సక్రమంగా ఉన్నాయో లేవో టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించాలని, రోడ్లను ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ జరిగే నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.