- హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహణ
- ఇయ్యాల్టి నుంచి రెండు రోజులపాటు జాబ్ మేళా
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా అధికారులు
సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగుల కోసం హుజూర్ నగర్ లో శనివారం నిర్వహించే మెగా జాబ్ మేళాకు భారీగా స్పందన వస్తోంది. ఇప్పటికే 40 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో నిరుద్యోగులు భారీగా దరఖాస్తులు చేసుకోగా.. రెండో రోజు ఆదివారం కూడా మేళా నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చేందుకు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ జాబ్ లు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా మెగాజాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
తొలుత 150 కంపెనీలు పాల్గొనేందుకు సిద్ధం కాగా.. నిరుద్యోగులు భారీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా.. పాల్గొనే కంపెనీల సంఖ్య కూడా 275కు చేరింది. 36 వేల మంది నిరుద్యోగులు ఆన్ లైన్ లో, మరో 4 వేల మంది ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భారీగా తరలివచ్చే నిరుద్యోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మెగా జాబ్ మేళాపై ఉమ్మడి జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు.
మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు..
హుజూర్ నగర్ జాబ్ మేళా ఏర్పాట్లపై సూర్యాపేట జిల్లాస్థాయి అధికారులతో పాటు కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీల వివరాలను కేటగిరీ వారీగా విభజించారు. పూర్తి వివరాలను ఫ్లెక్సీల్లో ప్రదర్శించారు. నిరుద్యోగులకు ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం వసతి కూడా కల్పిస్తున్నారు.
హుజూర్ నగర్ కు ప్రత్యేక బస్సులు
మెగా జాబ్ మేళా కోసం వచ్చే నిరుద్యోగుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. అంతేకాకుండా నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా నిరుద్యోగులను తరలించేందుకు స్థానిక ప్రజా ప్రతి నిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హుజూర్ నగర్ కు బస్సు సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.
జాబ్ మేళాకు అనూహ్య స్పందన : ఉత్తమ్
హుజూర్ నగర్ : మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చినందున రెండో రోజు ఆదివారం కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుజుర్ నగర్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో పాటు జిల్లా అధికారులు, డీఈఈటీ, సింగరేణి కాలరీస్ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోందని, రద్దీని దృష్టిలో పెట్టుకొని రెండోరోజు కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగులు ఒత్తిడికి లోను కాకుండా ఇంటర్వ్యూలో పాల్గొనాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా.. గ్రూప్-–1, గ్రూప్–-2 ఉద్యోగ నియామకాలతో పాటు గత రెండేండ్ల లో 70 వేల జాబ్ లు భర్తీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం నిర్వహించే మెగా జాబ్ మేళాకు భారీగా స్పందన లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక కంపెనీలన్నీ పాల్గొనేందుకు ముందుకొచ్చాయన్నారు.
