తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : మంత్రి వాకిటి శ్రీహరి

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి, వెలుగు :  ఆత్మకూరు మున్సిపాలిటీలో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికంగా పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రి  వాకిటి శ్రీహరి సూచించారు.  గురువారం ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసు మీటింగ్​ హాల్​లో  కొత్తగా ఎంపికైన వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు.  ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, పారిశుధ్యం సమస్యలు లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 మున్సిపాలిటీలో సాయంత్రం ఆరు గంటలకు వీధి దీపాలు వెలగాలని, ఉదయం 6 గంటలకు ఆఫ్ కావాలని సూచించారు. లో ఓల్టేజి ఇబ్బంది ఉండొద్దన్నారు. ఒక్కో వార్డు ఆఫీసర్ ను వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. తాగు నీరు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతివారం వార్డు ఆఫీసర్లు, కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  డ్రైన్ లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వీడాలని, దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలకు మెరుగైన  ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని, పీహెచ్​సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఆత్మకూరులో ఇప్పటికే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని,  అన్ని పూర్తి అయితే మరో 152 ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంఓల ఏడీసీ యాదయ్య , మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్​పర్సన్​ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శశిధర్, తహసీల్దార్ చాంద్ పాషా  పాల్గొన్నారు.